17-02-2026 02:15:59 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి) : కిడ్నాప్‌లు, దాడులు, అక్రమ ఓట్ల తో పదవులను కొల్లగొట్టే కుట్ర చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలోని వివిధ మున్సిపాలిటీల్లో జరుగుతున్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా అధికార కాంగ్రె స్ పార్టీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక అరాచక విధానాలను కేటీఆర్ సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన ప్రభుత్వం, పోలీసు బలగాలను అడ్డుపెట్టుకొని గూండా ల మాదిరిగా వ్యవహరించడం శోచనీయమని తెలిపారు. స్వయంగా ఎంపీలు, ఎమ్మె ల్యేలే గెలిచిన ప్రజాప్రతినిధులను కిడ్నాప్ చేసే ప్రయత్నాలకు పాల్పడడం, ఎక్కడికక్కడ దాడులకు తెగబడడంపై ఆయన తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా తొర్రూ ర్, జనగామ, క్యాతనపల్లి, కాగజ్‌నగర్ వంటి అనేక పట్టణాల్లో పోలీసులు వ్యవహరించిన తీరును కేటీఆర్ ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ పోలీసు బలగాలను అడ్డుపెట్టుకొని పలు పట్టణాల్లో అభ్యర్థులను కిడ్నాప్ చేసే ప్రయ త్నం చేయడం కాంగ్రెస్ ‘గూండా రాజ్యానికి’ అద్దం పడుతోందని విమర్శించారు. స్వయం గా అధికారులు, పోలీసులు అధికార పార్టీ నేతలతో చేతులు కలిపి ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కారని మండిపడ్డారు.
మంత్రులు, ఎమ్మెల్యేలే నేరుగా అక్రమ పద్ధతుల్లో చైర్మన్ల ఎంపిక ప్రక్రియలో తలదూ ర్చడంపై ఆయన దుయ్యబట్టారు. ముఖ్యం గా ఎక్స్ అఫీషియో ఓట్ల పేరుతో దొంగ ఓట్లను నమోదు చేసుకొని మరీ పదవులను పొందాలని చూడడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని పేర్కొన్నారు. మున్సిపాలిటీల చైర్మన్‌గా ఎంపికలో జరిగిన దౌర్జన్యాలను కేటీఆర్ ఎత్తిచూపారు. అనేక చోట్ల కాంగ్రెస్ నాయకులు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి బెదిరింపులు, పార్టీ మార్పులు, దాడులకు పాల్ప డ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల సంఘం పనితీరు మాయని మచ్చ..
పలు పట్టణాల్లో బీఆర్‌ఎస్ మాజీ మం త్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడులను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. పట్టపగలు పోలీసుల సమక్షంలోనే గెలిచిన ప్రజాప్రతినిధులను అడ్డుకుంటున్నా స్పం దించని పోలీసుల తీరును చూస్తే రాష్ర్టంలో శాంతిభద్రతలు ఎంతలా దిగజారాయో అర్థమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే రాష్ట్ర డీజీపీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కోరం ఉన్న చోట్ల కూడా కేవలం అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి ఎన్నికలను వాయిదా వేయడం ఎన్నికల సంఘం పనితీరుపై మాయని మచ్చగా నిలుస్తుందని ఆక్షేపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించి ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
అక్రమ కిడ్నాప్‌లు, దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి, ప్రజాస్వామ్య పరిరక్షణకు పూనుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తన క్రిమినల్ మెంటాలిటీతో, గూండాల బలంతో ప్రజల ఆకాంక్షలను, బీఆర్‌ఎస్ పోరాటాలను ఆపలేదని హెచ్చరించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సాగిస్తున్న ఈ అరాచకానికి, గూండాయిజానికి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కేటీఆర్ స్పష్టం చేశారు.