17-02-2026 02:16:08 AM
రైతులకు గుడ్ న్యూస్
2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతులకు తీపికబురు చెప్పింది. వానాకాలానికి సంబంధించిన సన్న వడ్ల బోనస్ బకాయిలను సర్కార్ విడుదల చేసింది. 2.17 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 514.36 కోట్లను సోమవారం జమచేసింది. రాష్ట్రంలో సన్న వరిని పండించే రైతులకు క్వింటాకు రూ. 500 బోనస్ ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ బోనస్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు అదనంగా లభిస్తుంది.
కొంతకాలంగా బోనస్ బకాయిల కోసం ఎదురు చూస్తున్న రైతుల కు ఈ నిధుల విడుదల పెద్ద ఊరటనిచ్చింది. సోమవారం విడుదల చేసిన బోనస్ నిధులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ కింద రూ. 1,939.58 కోట్లను రైతులకు చెల్లించింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం సన్నవరికి మద్దతు ధరకు అదనం బోనస్ రూపంలో రైతులకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది.
తాజా నిధుల విడుదలతో రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న బోనస్ బకాయిలు దాదాపు పూర్తికావచ్చాయని సివిల్ సప్లయ్ శాఖ తెలిపింది. ఒకవేళ నిధులు జమకావడంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే వెంటనే సంబంధిత ధాన్యం కొనుగోలు కేంద్రాలను లేదా జిల్లా సివిల్ సప్లయ్ శాఖ కార్యాలయాన్ని రైతులు సంప్రదించాలని అధికారులు సూచించారు.