calender_icon.png 17 February, 2026 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవులకు బీసీలు అనర్హులా?

17-02-2026 02:11:41 AM

చైర్ పర్సన్ పదవి నిరాకరించడంతో.. కౌన్సిలర్‌గా ప్రమాణస్వీకారం.. 

గంట తరువాత రాజీనామా 

వనపర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి చీర్ల రజిని సంచలనం

మిత్తీలకు డబ్బులు ఇచ్చేవారికే కాంగ్రెస్‌లో పదవులా..: పట్టణ కాంగ్రెస్ నేత చీర్ల చందర్ 

వనపర్తి, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): ప్రమాణస్వీకారం చేసిన గంట వ్యవధి తరువాత కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసిన సంఘటన వనపర్తి మున్సిపాలిటీలో సోమవారం చోటు చేసుకుంది. వనపర్తి మున్సిపాలిటీలో 3 వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చీర్ల రజిని ఈ ఎన్నికల్లో పోటీచేసి దాదాపు 535 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వనపర్తి మున్సిపాలిటీ చైర్ పర్సన్ పీఠం జనరల్ మహిళకు రిజర్వేషన్ కావడంతో పలువురు పోటీపడ్డారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి చైర్మన్ పదవి నీకే ఇస్తానని మొదటినుంచి వాగ్దానం చేసి చివరికి మాట తప్పారని చీర్ల రజిని ఆవేదనతో చెప్పారు.

ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇచ్చిన మాటపై తను నామినేషన్ వేశానని, చివరికి వేరేవారికి చైర్మన్ పీఠం కట్టబెట్టబడంతో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 22 మంది కౌన్సిలర్లు గెలిచారని, అందులో అగ్రకులాల నుంచి ఉన్నది ఒకే ఒక్కరని.. ఆ ఒక్కరి కోసం 21 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులను తొక్కేస్తారా అని చీర్ల రజిని ప్రశ్నించారు. ‘బీసీలకు ఒక అవకాశం ఇయ్యారా..? తొలిసారి గెలుపొందిన మాధవి రమేశ్‌కు చైర్మన్ పదవి ఇచ్చారు. వారికి బర్త్ సర్టిఫికెట్ అంటే తెల్వది.. డెత్ సర్టిఫికెట్ అంటే తెల్వదు.. మున్సిపాలిటీ గురించి ఏం తెల్వదు.. వాళ్లకు చైర్ పర్సన్ పదవి ఇవ్వడంలో అర్థమేమిటీ..?’ అని ఎమ్మెల్యే మేఘారెడ్డిని ఆమె ప్రశ్నించారు.

టికెట్ ఇచ్చినప్పుడు చైర్ పర్సన్‌గా అవకాశం ఇస్తేనే పోటీ చేస్తామని చెప్పామని, తీరా ఇప్పుడు మమ్మల్ని మోసం చేశారని రజిని మీడియాకు చెప్పారు. దాదాపు 70 ఏండ్లుగా పార్టీలో ఉన్న మా కుటుంబానికి కాకుండా, డబ్బులు ఉన్నవారిని అందలం ఎక్కించడమేమిటీ అని ఆవిడ ప్రశ్నించారు. కౌన్సిలర్ పదవికి చీర్ల రజిని రాజీనామా సంఘటన వనపర్తి పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది. 

మాట ఇచ్చి తప్పారు : చీర్ల చందర్ 

అసెంబ్లీ ఎన్నికలకు ముందు చిన్నారెడ్డితో కలిసి పనిచేశానని, పార్టీ బీ ఫామ్ ఎమ్మెల్యే మేఘారెడ్డికి వచ్చిన తర్వాత పార్టీ కోసం రాత్రి పగలు పనిచేసినట్లు కౌన్సిలర్ చీర్ల రజిని భర్త, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ చెప్పారు. తమ కుటుంబం తాతల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉందని ఆయన తెలిపారు. కానీ పార్టీకోసం పనిచేసిన వారికి కాకుండా మిత్తీలకు డబ్బులు ఇచ్చినవారికి ఈరోజు చైర్ పర్సన్ పదవి కట్టబెట్టడం బాధాకరమన్నారు.

ప్రతినిత్యం పార్టీ బలోపేతం కోసం కార్యకర్త లాగా పనిచేశానని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా అనుభవమున్న మమ్మల్ని కాదని డబ్బులు ఉన్న వారికి పదవి కట్టబెట్టడం సరైనది కాదన్నారు. చైర్ పర్సన్ పదవి ఆశించిన అందర్నీ క్యాంపుకు తరలించి కూర్చోబెట్టి మాట్లాడకుండా, హైకమాండ్ నుంచి వచ్చిన వారికి చైర్ పర్సన్ పదవి ఇస్తామని మాయమాటలు చెప్పారని విమర్శించారు. కానీ ప్రమాణస్వీకారానికి వస్తున్న సందర్భంలో కొత్తకోటలో ఎంపీ మల్లు రవిని కలిసినప్పుడు, చైర్ పర్సన్ మీకే అని మాధవి రమేశ్‌కు చెప్పడం ఎంతవరకు సబబు ఆయన ప్రశ్నించారు.

సీల్ కవర్‌లో హైకమాండ్ నుంచి పేరు వస్తే, పార్టీ నాయకులకు ఎలా తెలిసిందని నిలదీశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి పదవులు రావని, డబ్బులు ఉన్నవారికి వస్తాయని తేలిందన్నారు. అందుకే తను పార్టీ సభ్యత్వానికి, తన భార్య కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి వెనుక ఉన్న ఆ ముగ్గురి వల్లే బీసీలకు అన్యాయం జరుగుతున్నదని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు.