26 May, 2026 | 5:34 AM

కేసీఆర్‌పై కాంగ్రెస్ సర్కార్ కుట్రలు

17-06-2024 12:10 AM

ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి

గజ్వేల్, జూన్ 16:  బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కాంగ్రెస్ సర్కార్ కక్షపూరితంగా కుట్రలు పన్నుతున్నదని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, ఫోన్ ట్యాపింగ్ పేరుతో కేసీఆర్‌ను దెబ్బతీయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. తాజాగా విద్యుత్ కమిషన్ పేరిట కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు.

కేసీఆర్ ప్రభుత్వంలో 24 గంటల పాటు కరెంట్ అందిందని గుర్తుచేశారు. మోసపూరిత హామీలతో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు, పింఛనుదారులు, రైతులు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు. ఆరు నెలల్లోనే రూ.40వేల కోట్లు అప్పు చేశారన్నారు. వాటిని దేనికి ఖర్చు పెట్టారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జడ్పీటీసీ పంగ మల్లేశం, నాయకులు బాలుయాదవ్, శ్రీనివాస్, మాదాసు శ్రీనివాస్, బెండ మధు పాల్గొన్నారు.