ఓటర్ల సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలి
- భద్రాచలం ఐటిడిఎ పిఓ రాహుల్
మణుగూరు,(విజయక్రాంతి): ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) ప్రక్రియను వేగవంతం చేయాలని 110–పినపాక నియోజకవర్గం ఈఆర్‌ఓ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్(ITDA Project Officer B Rahul) అధికారులను ఆదేశించారు. మంగళవారం మణుగూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ప్రక్రియ పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోటీసుల పంపిణీని వేగవంతం చేసి పెండింగ్‌లో ఉన్నవాటిని సంబంధిత వ్యక్తులకు తప్పనిసరిగా అందజేయాలని సూచించారు. నోటీసు అందిన ఏడు రోజుల అనంతరం విచారణ చేపట్టి, క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.
అనామలీస్, నో మ్యాపింగ్ జాబితాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ఏజెంట్లకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఓటర్లు సమర్పించే పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి స్వీకరించాలని, ఏఈఆర్‌ఓలు, బీఎల్‌ఓలు అందుబాటులో ఉండి వారికి సహకరించాలని సూచించారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్థితిని రోజువారీగా నోటీసు బోర్డులో నవీకరించాలని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.






