2 September, 2026 | 12:36 AM

ప్రభుత్వ రాయితీలు సద్వినియోగం చేసుకోవాలి

01-09-2026 | 11:48pm

- ఉద్యాన అధికారి గుడిమళ్ల సందీప్ కుమార్ 

బేల,(విజయక్రాంతి): సాంప్రదాయ పంటలకు భిన్నంగా జిల్లా రైతాంగం వాణిజ్య ఉద్యాన పంటలవైపు మొగ్గు చూపాలని, ఉద్యాన పంటల సాగు కొరకు ప్రభుత్వం అందజేస్తున్న అనేక రకాల రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి గుడిమళ్ల సందీప్ కుమార్*పేర్కొన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మంగ్రూల్ గ్రామంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా సందీప్ కుమార్ మాట్లాడుతూ... సమగ్ర ఉద్యాన మిషన్ లో భాగంగా ప్రభుత్వము వివిధ రకాల పండ్ల తోటలకు రాయితీ కల్పిస్తుందని, బిందు సేద్య పరికరాలు రాయితీలో కల్పిస్తుందని తెలిపారు.మామిడి, జామ, నిమ్మ, సీతాఫలం, అంజీర్, పసుపు మొదలైన ఉద్యాన పంటల తోటల సాగు చేసే రైతులకు రాయితీ లభిస్తుందని తెలిపారు. ఎల్ నినో ప్రభావం తో ఇబ్బంది పడే రైతులు ప్లాస్టిక్ మల్చింగ్, కూరగాయలు, పూల తోటల సాగు ద్వారా మెరుగైన ఆదాయం పొందడానికి అవకాశం ఉందని తెలిపారు.తదుపరి మంగ్రూల్ గ్రామంలో సాగు చేస్తున్న పామాయిల్ తోటను పరిశీలించి పామాయిల్ సాగుపై అవసరమైన సలహాలు సూచనలు సిబ్బందికి రైతులకు అందించారు. నలభై సంవత్సరాల పాటు ఆదాయం ఇచ్చే పామాయిల్ పంట సాగు చేయటానికి రైతులు ముందుకు రావాలని కోరారు.

తదుపరి చాంద్ పల్లి గ్రామంలో జాతీయ వెదురు పథకం లో భాగంగా వెదురు సాగు కొరకు ఎంపిక చేసిన రైతులకు నాణ్యమైన హైబ్రిడ్ వెదురు మొక్కలను రైతులకు సరఫరా చేశారు. అదే గ్రామంలో రైతులు సాగు చేస్తున్న పసుపు, మునగ, వంగ, టమాటో, మిర్చి పంటల ను పరిశీలించి రైతులకు సమగ్ర యాజమాన్యం పై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి అలేఖ్య, సిబ్బంది సతీష్, జగదీష్, ఉద్యాన శాస్త్రవేత్త మల్లేష్, మండల వ్యవసాయ అధికారి సాయి తేజ, సిపిఎఫ్ స్వచ్ఛంద సంస్థ అధికారి సత్యనారాయణ, సిబ్బంది మంగేష్, పూజ, 100 మంది రైతులు పాల్గొన్నారు.