23 June, 2026 | 2:00 PM

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిరాశపరుస్తోంది

23-06-2026 12:50 PM

బీజేపీ మండల అధ్యక్షుడు బాలాజీ

కొనరావుపేట, జూన్ 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ కోనరావుపేట మండల అధ్యక్షుడు మిర్యాల్కర్ బాలాజీ విమర్శించారు. మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు విద్యుత్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని డిమాండ్ చేశారు.కోనరావుపేట మండలంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన వడ్ల లారీల కుంభకోణంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

పలువురు రైతులకు లారీల ట్రక్ షీట్లు అందకపోవడంతో ధాన్యం విక్రయించినప్పటికీ డబ్బులు జమ కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. బాధిత రైతులకు వెంటనే బకాయిలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా గతంలో వడగళ్ల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ అంశాలపై స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు నిర్వహించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఎక్కలదేవి జలందర్, ఉపాధ్యక్షుడు చింతల పరశురాములు, కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్, కోశాధికారి వేల్పుల తిరుపతి, మహిళా మోర్చా అధ్యక్షురాలు తీగల జయశ్రీ, సోషల్ మీడియా కన్వీనర్ లంబ వేణు, సీనియర్ నాయకులు జింక వెంకటి, మోత్క మోహన్, కడార్ల వికాస్, బూత్ అధ్యక్షులు దూర శంకర్, పిల్లి వెంకటేష్, చావటపెల్లి వెంకన్న, మల్లబోయిన విజయ్, సాగర్ల శ్రీను, బుర్ర ఆంజనేయులు గౌడ్, వెలిశాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.