calender_icon.png 14 February, 2026 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగారెడ్డి మున్సిపోల్స్‌లో ‘హస్తం’ హవా

14-02-2026 12:33:46 AM

రంగారెడ్డి, ఫిబ్రవరి 1౩ (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలో ఉత్కంఠ భరితంగా సాగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. శుక్రవారం  జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోని 126 వార్డులకు జరిగిన ఈ పోరులో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకోగా, రెండు చోట్ల బీఆర్‌ఎస్ తన పట్టును నిలుపుకుంది.

హోరాహోరీగా సాగిన ఓట్ల లెక్కింపు

గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో అధికారులు మొదట పోస్టల్ బ్యాలెట్లను, అనంతరం బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కించారు. జిల్లా వ్యాప్తంగా 78.99 శాతం భారీ పోలింగ్ నమోదు కావడంతో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 437 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా, ఓటర్లు ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపారు.

ఎక్కడ ఎవరు విజయం సాధించారంటే?...

షాద్‌నగర్, శంకర్ పల్లి, మొయినాబాద్, మరియు చేవెళ్ల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించి ’పై చేయి’ సాధించింది. ఇబ్రహీంపట్నం మరియు ఆమనగల్లు మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు మ్యాజిక్ ఫిగర్ను దాటి తమ జయభేరి మోగించారు. జిల్లాలో ఆరు మున్సిపాలిటీల్లో  పార్టీల వారీగా వచ్చిన సీట్లు  ఇలా ఉన్నాయి.

ఆమనగల్లులో మొత్తం 15 వార్డులు.. కాంగ్రెస్ (1) బీఆర్‌ఎస్ (8) బిజెపి(6), ఇబ్రహీంపట్నంలో 24 వార్డులు.. కాంగ్రెస్( 8) బీ ఆర్‌ఎస్(13) బిజెపి (2 )స్వతంత్ర అభ్యర్థి 1, షాద్నగర్లో 28 వార్డులు.. కాంగ్రెస్ (15 )బీ ఆర్‌ఎస్ (11) బిజెపి( 1) స్వతంత్ర అభ్యర్థి (1), శంకర్పల్లి 15 వార్డులు..  కాంగ్రెస్( 9) బీ ఆర్‌ఎస్ (4) ఇండిపెండెంట్ ( 2), మొయినాబాద్ లో 26 వార్డులు.. కాంగ్రెస్( 10) బీ ఆర్‌ఎస్( 7) బిజెపి (4 )స్వతంత్ర అభ్యర్థులు( 5), చేవెళ్లలో 18 వార్డులు..  కాంగ్రెస్ (11) బీ ఆర్‌ఎస్ (4) బిజెపి  (3)

ఈ నెల 16న చైర్మన్ల ఎంపిక

ఎన్నికైన వార్డు సభ్యులతో ఈనెల 16వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం జరగనుంది. ఆయా మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు మరియు కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు.