1 August, 2026 | 1:13 AM

కాంగ్రెస్ నేతలకు సహకార పదవులు హుళక్కే!

01-08-2026 12:18 AM

కోర్టుకు వెళ్లిన చైర్మన్లు 

నామినేటెడ్ పద్ధతికి వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం 

మత్స్య సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్న కోర్టు 

ఆశావహులతో కాంగ్రెస్ నేతల బేరసారాలపై ఫిర్యాదులు

మేడ్చల్, జూలై 31 (విజయక్రాంతి): కాంగ్రెస్ నాయకులకు సహకార సంఘాల పదవులు నామినేటెడ్ పద్ధతిలో వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. సహకార చట్టంలో నామినేటెడ్ పద్ధతి లేనందున న్యాయస్థానంలో నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గాల నియామకానికి వ్యతిరేకంగా తీర్పువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

20 సహకార సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం పాలకవర్గాలను నామినేట్ చేసింది. దీనిపై ఆయా సంఘాల చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అయ్యే వరకు పాత పాలకవర్గాలను కొనసాగించాలని హైకోర్టు సూచించినప్పటికీ దానికి విరుద్ధంగా నామినేట్ చేయడం సరికాదని చైర్మన్లు పేర్కొన్నారు.

పిటిషన్ విచారించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీనిపై గురువారం వాదనలు జరిగాయి. మళ్లీ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం సహకార చట్టం 32 (ఏ) సెక్షన్ కింద పాలకవర్గాలను నామినేట్ చేసింది. ఈ సెక్షన్ కింద సొసైటీలకు పాలకవర్గాన్ని నామినేట్ చేసే అధికారం లేదని, చైర్మన్, వైస్ చైర్మన్ అవినీతికి పాల్పడినట్లు రుజువైనప్పుడు మాత్రమే ఈ సెక్షన్ కింద పాలకవర్గంలోని సభ్యులను మాత్రమే చైర్మన్, వైస్ చైర్మన్గా నియమించే అధికారం ఉంటుందని చైర్మన్లు అంటున్నారు. 

మత్స్య సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని తీర్పు 

మత్స్య సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని గురువారం ఆదేశించింది. మత్స్య సహకార సంఘాలకు నామినేటెడ్ పాలకవర్గాలను ఏర్పాటు చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని హనుమకొండ జిల్లాకు చెందినవారు హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారించిన న్యాయస్థానం మూడు వారాల్లో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోనూ మత్స్య సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అంతేగాక రైతు సహకార సంఘాలకు కూడా ఇలాంటి తీర్పే వచ్చే అవకాశం ఉందని చైర్మన్లు అభిప్రాయపడుతున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం సైతం వెనుకడుగు 

సహకార సంఘాలకు నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గాల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం సైతం వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. పాలకవర్గాల నియామకాలు మొదలు కాగానే పలుచోట్ల కాంగ్రెస్ ఇంచార్జీలు ఆశావహులతో బేరసారాలకు దిగారు. ఈ విషయంపై పిసిసికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. మేడ్చల్ జిల్లాలోనూ ఆరోపణలు వెల్లువెత్తాయి. 

ఆశావహుల్లో నిరాశ 

ఒకవైపు కోర్టు కేసు ఉండడం, మరోవైపు అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం సైతం వెనుకడుగు వేయడంతో ఆశావహులు నిరాశకు గురవుతున్నారు. ఆశావహులు తమ పేరు ఖరార్ అయిందని, ప్రకటించడమే తరువాయి అని ధీమాలో ఉన్నారు.

జిల్లాలో తొమ్మిది సహకార సంఘాలు ఉన్నాయి. సహకార పదవుల విషయమై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరించింది. దీంతో అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. మున్సిపల్ పాలకవర్గాలు, స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీ లేనందున పదవులు తగ్గిపోయాయి. దీంతో సహకార సంఘాల పదవులను ఆశించారు. కానీ ఈ పదవులు నామినేటెడ్ పద్ధతిలో వచ్చే అవకాశం లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు.