వీసీxసర్కార్
- జేఎన్టీయూలో రిజిస్ట్రార్ పోస్టింగ్ లొల్లి
- రిజిస్ట్రార్ జయలక్ష్మిని తొలగించాలని ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు
- ససేమిరా అంటున్న వీసీ.. తనకు మద్దతుగా వర్సిటీ సిబ్బంది ర్యాలీ
- గత రిజిస్ట్రార్‌నే మళ్లీ నియమించాలని మరోవర్గం పట్టు
హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): హైదరబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూచ్)లో రిజిస్ట్రార్ నియమాక అంశం వివాదాస్పదమైంది. ప్రస్తుత రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జయలక్ష్మిని తొలగించాలని సర్కార్ నుంచి ఒత్తిళ్లు రాగా, అందుకు వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ (వీసీ) టి.కిషన్‌కుమార్‌రెడ్డి ససేమిరా అంటున్నారని, దీంతో పరిస్థితి వైస్ ఛాన్స్‌లర్ వర్సెస్ సర్కార్‌లా తయారైందనే అభిప్రాయం వర్సిటీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది.
శుక్రవారం వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది ప్రస్తుత రిజిస్ట్రార్‌కు మద్దతుగా ర్యాలీ తీసి, ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రార్‌ను మార్చవద్దని నినాదాలు చేయడం చర్చనీయాంశమైంది. వర్సిటీ చరిత్రలో ఎన్నడూ ఒక మహిళా ప్రొఫెసర్‌కు రిజిస్ట్రార్‌గా ఎప్పుడూ అవకాశమివ్వలేదని, ఆమెనే కొనసాగిస్తూ యథాస్థితిని కొనసాగించకపోతే కొలువులు చాలించేందుకూ సిద్ధమని వారు ప్రకటించడం గమనార్హం. వీసీ కొంత కాలం క్రితం వర్సిటీరిజిస్ట్రార్‌గా జయలక్ష్మిని నియమించారు.
అయితే.. ఇప్పటికే రిజిస్ట్రార్‌గా పనిచేసిన ప్రొ.కే వెంకటేశ్వరరావు సైతం రిజిస్ట్రార్ రేసులో ఉన్నారు. వర్సిటీతోపాటు ప్రభుత్వంలో కొందరు పెద్దలు జయలక్ష్మికి అండగా ఉండగా, మరికొందరు వెంకటేశ్వరరావుకు మద్దతుగా ఉన్నారు. జయలక్ష్మిని తొలగించి వెంకటేశ్వరరావుకు అవకాశం కల్పించాలని ఒకవర్గం, జయలక్ష్మినే కొనసాగించాలని మరోవర్గం పట్టుబడుతోంది. ఈ మేరకు వీసీపై ఒత్తిడి తెస్తున్నారు.
వీసీపై ఉన్నతాధికారి ఒత్తిడి
రిజిస్ట్రార్ పోస్టు నుంచి జయలక్ష్మిని తొలగించాలని గురువారం ఓ విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు వీసీపై ఒత్తిడి తెచ్చి, గతంలో రిజిస్ట్రార్ పనిచేసిన వెంకటేశ్వరరావుకే పోస్టు అప్పగించాలని ఒత్తిడి చేసినట్టు తెలిసింది. సాధారణంగా ఒక వీసీకి వర్సిటీ పరిధిలో రిజిస్ట్రార్, రెక్టార్లను వర్సిటీ పాలకమండలి ఆమోదంతో నియమించుకునే అధికారం ఉంటుంది. అయితే.. తాను నియమించిన రిజిస్ట్రార్‌ను తనే తొలగిస్తే తన పరువేంకా వాలని వీసీ మదనపడుతున్నారు.






