1 August, 2026 | 12:34 AM

గ్రామీణులకు మెరుగైన వైద్యమే లక్ష్యం

01-08-2026 12:00 AM
  1. మహదేవపూర్ ఆసుపత్రిని పునర్నిర్మిస్తాం 
  2. ఆరోగ్య శిబిరాలతో సేవల విస్తరణ
  3. ఆగస్టు 4న మెగా ఉచిత ఆరోగ్య శిబిరం
  4. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

భూపాలపల్లి/ మహదేవపూర్, జూలై 31 (విజయ క్రాంతి): మారుమూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శిథిలావస్థలో ఉన్న మహదేవపూర్ సామాజిక ఆసుపత్రిని ఆధునిక వసతులతో పునర్నిర్మించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని వెల్లడించారు.

శుక్రవారం మహదేవపూర్ సామాజిక ఆసుపత్రిలో ఐడీబీఐ సహకారంతో ఎంఎన్‌జే ఆసుపత్రి హైదరాబాద్, ఓమెగా ఆసుపత్రి కరీంనగర్ వైద్య బృందాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్, కంటి పరీక్షల శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ముఖ్యంగా మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

పేద ప్రజలు ఆర్థికంగా నష్టపోకుండా వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించేందుకు ఇలాంటి శిబిరాలు ఉపయోగపడతాయని అన్నారు. హెల్త్ ఏటీఎం ద్వారా 64 రకాల వైద్య పరీక్షలను వేగంగా నిర్వహించే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. పరీక్షల వివరాలు కార్డు రూపంలో అందించి ఐదేళ్ల వరకు భద్రపరచే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. కంటి పరీక్షల కోసం ప్రత్యేక పరికరాలు, గుండె సంబంధిత సమస్యల గుర్తింపునకు ఈసీజీ యంత్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

మహిళలు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, వ్యాధులను ప్రారంభ దశలో గుర్తిస్తే మెరుగైన చికిత్స పొందవచ్చని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజల సౌకర్యార్థం ఆగస్టు 4న ఎంఎన్‌జే ఆసుపత్రి ఆధ్వర్యంలో మరోసారి ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రతి ఒక్కరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు కాటారం డివిజన్ పరిధిలో 680 మందికి హైదరాబాద్‌లో ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించినట్లు, మంథని నియోజకవర్గంలో సుమారు 45 వేల మందికి కంటి చికిత్సలు అందించినట్లు మంత్రి వివరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజోపయోగ కార్యక్రమాలను మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌శర్మ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.