కమ్.. కమ్.. వెల్‌కమ్

22-04-2024 01:35:41 AM

కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా వలసలు

అంతకు కొద్దిగా తక్కువ స్థాయిలో బీజేపీలోకి..

ఇప్పుడంతటా ‘ఆపరేషన్ ఆకర్ష్’

మహబూబ్‌నగర్, ఏప్రిల్ (విజయక్రాంతి): వేసవి తాపాన్ని మించి పార్లమెంట్ ఎన్నికలు హీట్ ఎక్కిస్తున్నాయి. రాజకీయ పార్టీలు నువ్వా..? నేనా..? అనే విధంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ చేరికలను ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యనాయకులకు గాలాలు వేస్తున్నాయి.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తద్వారా ఆ పార్టీ ప్రాబల్యం పెరిగింది. దీంతో ఎక్కువ మంది నేతలు ‘చేయి’ అందుకోవడానికే ఇష్టపడుతున్నారు. అలాగే మోస్తరుగా బీజేపీలో కొందరు చేరుతున్నారు. చిన్నాచితకాగా బీఆర్‌ఎస్‌లోకీ వలసలు ప్రారంభమయ్యాయి. 

రెండు పార్టీల్లోకే ప్రధానంగా..
కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమిస్తున్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని, వారి సరై సమయంలో సముచిత స్థానం కల్పిస్తామని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఓ సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ హామీ ఎంతోమంది కార్యకర్తలు, నాయకుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. కొత్తగా చేరిన వారితో పాటు ఇప్పటికే పార్టీలో కొనసాగుతున్న వారు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కాకపోయినా ఇకముందైనా నామినేటెడ్ పదవులు వస్తాయని, అన్నీ కుదిరిస్తే ఇంకా మంచి పదవులే రావొచ్చని ఆశపడుతున్నారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా ‘కేంద్రంలో అధికారంలో ఉన్నదీ మేమే.. మళ్లీ అధికారంలోకి వచ్చేదీ మేమే..’ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.