మహిళా బిల్లు వ్యతిరేకి కాంగ్రెస్
- సమాజ్‌వాదీ, కాంగ్రెస్ అభివృద్ధికి ఆటంకాలు
- దేశం మరోసారి ఈ పార్టీల అసలు స్వరూపం చూసింది
- నారీ శక్తిని అడ్డుకున్న వారికి ప్రజలు బుద్ధి చెబుతారు
- గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ
లక్నో, ఏప్రిల్ 29: మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సమాజ్‌వాదీ, కాంగ్రెస్ అభివృద్ధికి ఆటంకాలుగా మారాయని, దేశం ఇటీవల మరోసారి ఈ పార్టీల అసలు స్వరూపాన్ని చూసిందని, నారీ శక్తిని అడ్డుకున్న వారికి ప్రజలు బుద్ధి చెబుతారని విమర్శించారు. బంగాల్ మార్పు కోరుకుంటోందని, ఇందుకు ప్రజలు భారీస్థాయిలో పోలింగ్‌కేంద్రాలకు తరలిరావడం, రికార్డుస్థాయిలో ఓటింగ్ నమోదు కావడమే నిదర్శన మని స్పష్టం చేశారు.
అభివృద్ధిలో ఉత్తరప్రదేశ్ దూసుకెళ్తోందన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రవాణా వ్యవస్థలో ఒక సరికొత్త అధ్యాయమైన మీరట్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు 594 కిలోమీటర్ల పొడవు గల గంగా ఎక్స్‌ప్రెస్‌వేని హర్దోయ్ జిల్లాలో బుధవారం ఏర్పా టు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని బటన్ నొక్కి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ అభివృద్ధికి, మహిళా బిల్లుకు వ్యతిరేకమని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా విమర్శించారు. దేశం ఇటీవల మరోసారి వీరి అసలు స్వరూపాన్ని చూసిందని ఆయన మండిపడ్డారు. నారీ శక్తి వందన్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన పార్టీలను ఆయన నిలదీశారు.
మహిళల సాధికారతను అడ్డుకోవడమే వీరి లక్ష్యమని ఆయన ఆరోపించారు. సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు అభివృద్ధికి ఆటంకాలుగా మారాయని ఆయ న దుయ్యబట్టారు. గతంలో వారి తీరు మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ఉందని ఆయన గుర్తు చేశారు. నారీ శక్తిని తక్కువగా అంచనా వేసే వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. మహిళల హక్కుల కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోం దని పేర్కొన్నారు. గంగా ఎక్స్‌ప్రెస్‌వే రాష్ట్రానికి కొత్త జీవనాడిలా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్ల రా ష్ట్రం వేగంగా పురోగమిస్తోందని తెలిపారు. పేదలు, రైతులు, యువత సంక్షేమమే తమ ధ్యేయమని వివరించారు. పశ్చిమ బంగాల్ ఎన్నికల పోలింగ్‌పై కూడా ప్రధాని స్పందించారు. అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఓటు వేయడానికి తరలి వచ్చారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
దశాబ్దాల కాలంలో ఎన్నడూ చూడని విధంగా ఓటింగ్ జరిగిందని ఆయన చెప్పారు. బంగాల్ మార్పు కోరుకుంటోందన్నారు. గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు వల్ల 12 జిల్లాల రూపురేఖలు మారిపోతాయని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌ను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఈ రహదారి దోహదపడుతుందని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో యూపీ దేశానికే ఆదర్శమని ఆయన ప్రశంసించారు. గతంలో మీరట్ నుంచి ప్రయా గ్‌రాజ్ చేరుకోవడానికి సుమారు 10 నుంచి 12 గంటల సమయం పట్టేదని, ఈ ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం 6 గంటలకు పరిమితం కానుందని చెప్పారు.
మీరట్, హాపూర్, బులంద్ షహర్, అమ్రోహా, సంభాల్, బదాన్, షాజహాన్‌పూర్, హర్దోయ్, ఉన్నావ్, రాయబరేలి, ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్ జిల్లాల ప్రజలకు ఇది గొప్ప వరం కానుందని అన్నారు. సుమారు రూ.37,350 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మించామని, ఇది అత్యాధునిక ఆరు వరుసల రహదారని, భవిష్యత్తు అవసరాల దష్ట్యా దీనిని 8 వరుసలకు విస్తరించేలా డిజైన్ చేమని అన్నారు. అదనంగా 146 కిలోమీటర్ల విస్తరణతో మరిన్ని ప్రాంతాలు అనుసంధానం అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు రెండు లక్షల మందికి పైగా బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. జై శ్రీరామ్ నినాదాలతో సభామం డపం మారుమోగింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ సహా పలువురు రాష్ట్ర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






