30 August, 2026 | 3:15 AM

గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది: కేటీఆర్

20-05-2024 01:01 PM

భద్రాద్రి కొత్తగూడెం: ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లెందు మండలంలో ఎమ్మెల్సీ ప్రచార సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సదర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి 6 నెలల్లోనే ప్రజలకు అర్ధమైందని తెలిపారు. తమ పాలనలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని కేటీఆర్ పేర్కొన్నారు.

ప్రైవేట్ రంగంలో 24 లక్షల ఉద్యోగాలు కల్పనకు కృషి చేశామని వెల్లడించారు. గత పదేళ్లలో ఏ రాష్ట్రం కూడా ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో బీఆర్ఎస్ నాయకులపై బాగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల కల్పనపై తాము సరిగా ప్రచారం చేసుకోలేదన్నారు. గత 65 ఏళ్లలో రాష్ట్రానికి వచ్చిన వైద్య కళాశాలలు 3 మాత్రమేనని ఆరోపించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 33 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేశామని గుర్తుచేశారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లామన్నారు.