కాంగ్రెస్ పార్టీ పటిష్టతపై అధినాయకత్వం దృష్టి
బోథ్,(విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసి రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్న దృక్పథంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నరేష్ జాదవ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయనతోపాటు ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎంపీ సోయం బాబూరావు తనదైన శైలిలో కార్యకర్తలను సమయత్వం చేస్తున్నారు. దాదాపు 40 సంవత్సరాల కాలంగా నియోజక వర్గం నుండి ఎమ్మెల్యే స్థానం కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోలేదు. దీంతో ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ జెండా నియోజకవర్గంలో ఎగరవేయాలని ఆలోచిస్తున్నారు.
గ్రామస్థాయి నుండి పటిష్టం
కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుండి పటిష్ట పరచాలన్న ఆలోచనతో జిల్లా అధ్యక్షులు గ్రామస్థాయి ఎన్నికలతో పాటు బూత్ అధ్యక్షులను సైతం నియమించనున్నారు. గ్రామస్థాయి మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు ఎస్సీ ఎస్టీ మహిళ కమిటీలను సైతం ఏర్పాటు చేసి యువతను రాజకీయాల్లోకి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే గ్రామాల వారీగా చురుకైన కార్యకర్తలను గుర్తించి వారికి పార్టీ పదవులు కట్టబెట్టాలన్న ఆలోచనలు నాయకత్వం ప్రయత్నిస్తున్నది.
మేమంతా ఒక్కటే మీరు ఒకటిగా ఉండాలి
పార్టీలో గ్రూపు విభేదాలు ఉండవద్దు ఆది నాయకత్వం కాంగ్రెస్ పార్టీ జెండా కిందనే పనిచేయాలన్న ఆదేశాలు ఇచ్చింది. మాలో గ్రూపులు లేవు మీరు గ్రూపులు కట్ట వద్దంటూ జిల్లా అధ్యక్షులు క్రింది స్థాయి నాయకత్వానికి సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పేర్కొంటున్నారు. ముందు గ్రామస్థాయిలో పార్టీ పట్టిష్టంగా ఉంటే జిల్లా స్థాయిలో సైతం పార్టీ అభ్యర్థులు పదవుల్లో కొనసాగే వీలుంటుందని పేర్కొంటున్నారు.
లీకేజీలు వద్దు ఉంటే చర్యలు తప్పవు
కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇతర పార్టీల నాయకులతో చేతులు కలిపి పార్టీ కార్యక్రమాలను పార్టీ తీసుకునే నిర్ణయాలను ప్రతిపక్ష పార్టీలకు చేరవేసే లీకేజీ నాయకులు ఉంటే పార్టీ వదిలి వెళ్ళండి. లేకుంటే మేమే చర్యలు తీసుకుంటామంటూ జిల్లా అధ్యక్షుడు పలు సమావేశాల్లో పేర్కొనడం జరిగింది. జిల్లా అధ్యక్షుని ఆదేశాలతో పార్టీలో అంతర్ మదనం కొనసాగుతున్నది. కొంతమంది నాయకులు కాంగ్రెస్ జెండా కింద ఉంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులతో చేతులు కలుపుతున్నారని ఇది సరైన పద్ధతి కాదంటూ ఆయన సుదిమెత్తగా హెచ్చరించారు.
సమావేశాలలో మాజీ ఎంపీ సోయం బాపూరావు పాల్గొంటూ కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నారు. ఒకదశలో బి ఆర్ ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూనే పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనా రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీని మరింత పటిష్ట పరిచి గెలుపు దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.






