పోడు సాగు రైతులపై ఆంక్షలు, టైగర్ జోన్ ఎత్తివేయాలి
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా అంతా ఆందోళన
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ ,కడం, మండలాల్లోని పోడు సాగు రైతుల భూముల్లో ట్రాక్టర్లు వాడరాదని ఫారెస్ట్ అధికారులు చేస్తున్న హెచ్చరికలు వెనక్కి తీసుకోవాలని, టైగర్ జోన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో శనివారం ఖానాపూర్ పట్టణంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ నుండి అటవీ శాఖ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆ శాఖ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నందిరామయ్య మాట్లాడుతూ దశాబ్దాలుగా అడవిని , భూమిని నమ్ముకుని పోడు వ్యవసాయం సాగు చేస్తున్న వారిని బెదిరించడం అన్యాయమని పోడు భూముల్లో ట్రాక్టర్ల ద్వారా వ్యవసాయం చేయడం మానుకోవాలని హెచ్చరికలు చేయడం దుర్మార్గమని, అటవీ అధికారులు మారిన పరిస్థితి అర్థం చేసుకోకుండా వ్యవసాయ రంగంలో మార్పులను అర్థం చేసుకోకుండా, ట్రాక్టర్లు వినియోగించకూడదని హెచ్చరించడం దారుణమని అన్నారు. దాంతోపాటు ఇటీవల జరిగిన ఉడుంపూర్ ,ఇంధనంపల్లి, ఘటనలలో అటవీ అధికారులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు.
ప్రజలపై దాడులు ఆపాలని, మరోవైపు టైగర్ జోన్ పేరుతో ఆదివాసులను ఇతర పేదలను అడవిలోకి వెళ్లకుండా ఎక్కడికక్కడ నిరోధించడం సరికాదని, ఆదివాసి చట్టాలను తుంగలో తొక్కుతున్నారని వెంటనే టైగర్ జోన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో ఏఐకేయూఎస్ మండల నాయకులు జక్కుల రాజన్న, నూనె నర్సింగరావు, అడగట్ల శంకర్, అభి యాదవ్, పెందూరు మోహన్, మచ్చ మనోహర్, మచ్చ శ్రీనివాస్, పూసమ్ లక్ష్మణ్ ,జైతు, ఎర్రన్న, కామెర రాజన్న ,శంభు, గోరే బాయ్, వర్మ, భూమేష్, శేఖర్, లాలూ, దేవరావు, తదితరులు ఉన్నారు.






