కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి
లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు అన్యాయం చేసింది
మాదిగలకు రాజ్యసభ వచ్చేలా చూడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిదే
ఎంఎస్పీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ
నల్గొండ టౌన్, మార్చి 4: తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగ సామాజిక వర్గానికి ప్రస్తుతం భర్తీ కాబోతున్న రాజ్యసభ స్థానాలలో కాంగ్రెస్ మాదిగలకు ఒక స్థానం ఇవ్వాలని, గత లోక్ సభ ఎన్నికల్లో ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా మాదిగలకు చేసిన అన్యాయాన్ని ఇప్పటికైనా సరిదిద్దుకోవాలని ఎంఎస్పి నల్లగొండ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడ సునీల్ మాదిగలు డిమాండ్ చేశారు.
బుధవారం జిల్లా కేంద్రంలోని ఇంద్ర భవన్ మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు రాజ్యసభలో ప్రాతినిధ్యం కలిగి ఉన్న రెడ్డి, బీసీ సామాజిక వర్గానికి ఇచ్చే బదులు అసలే రాజకీయ ప్రాతినిధ్యం లేని మాదిగలకు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించాలని డిమాండ్ చేశారు. గతంలో రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో మాదిగలకు ఏకకాలంలో రాజ్యసభలోను, లోక్‌సభలోను ప్రాతినిధ్యం ఉందని అన్నారు.చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏకకాలంలో టీడీపీలో తెలంగాణ నుండి ఇద్దరు మాదిగలు లోక్ సభ లో ఉన్నారు.అందులో ఒకరు మంద జగన్నాథం మరొకరు సుగుణ కుమారి.
అదే సమయంలో టీడీపీ నుండి మరొకరు రాజ్యసభలో మాదిగ సామాజిక వర్గం నుండి ఆకారపు సుదర్శన్ ఉన్నారు.కానీ రేవంత్ రెడ్డి కాలంలో మాదిగలు లోక్ సభలో, రాజ్యసభలోను ఒక్కరు కూడా లేకుండా పోయారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి , చంద్రబాబు నాయుడులతో పోల్చుకుంటే మాదిగలకు సరైన ప్రాతినిధ్యం, గుర్తింపు ఇవ్వడంలో రేవంత్ రెడ్డి చాలా వెనుకబడి ఉన్నాడని స్పష్టం చేశారు. మాదిగ బిడ్డే ముఖ్యమంత్రిగా ఉన్నాడని అనుకోవాలని మాదిగలకు గొప్పలు చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఆచరణలో మాత్రం మాదిగ జాతిపై సవతి ప్రేమను చూపుతున్నాడని అన్నారు.
రాజ్యసభ స్థానాల్లో మాదిగలకు న్యాయం జరిగే వరకు మంద కృష్ణ మాదిగ గారి పిలుపుమేరకు అవసరమనుకుంటే MRPS ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఆందోళనలు చేపడతామని అన్నారు. ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నియోజకవర్గ ఇన్చార్జి మధ్య దేవయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపా అధ్యక్షులు మాచర్ల సుదర్శన్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి తరి ఏడుకొండలు, ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు మాసారం వెంకన్న మాదిగ, ఎంఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జ చిన్న మాదిగ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు పాల్గొన్నారు.




