మోటార్ కేబుల్ వైరు చోరీ.. అడ్డుకునే వారేరీ?
మోటార్ కేబుల్ వైర్ ల చోరీతో రైతులు బెంబేలు
వరుస ఘటనలతో అయోమయం.
ఇప్పటికే దాదాపుగా 100 మోటార్ల వైర్లను కత్తిరించిన దొంగలు
మోటార్లకు వైర్లు లేక లబోదిబోమంటున్న రైతులు
గోపతండా, నేరడవాయి గ్రామాలే లక్ష్యంగా దొంగతనాలు
మోతె, మార్చి 4 : భూతల్లిని నమ్ముకొని పంట సాగు చేస్తున్న రైతన్నకు పంట మొక్కలు నాటి నుండి కష్టాలు మొదలవుతున్నాయి. ప్రారంభంలో నీరు సక్రమంగా లేక పొలాలు పారించేందుకే ఇబ్బంది పడ్డ రైతన్న తదుపరి సకాలంలో యూరియా అందకపోవడంతో అష్ట కష్టాలు పడుతూ ముందుకు సాగుతున్నాడు.
ఈ క్రమంలోనే బావులకు బోర్లకు అమర్చుకున్న మోటార్ల కేబుల్ వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేస్తుండడంతో రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందం అయింది. దీంతో రైతుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. మోతె మండలంలోని పలు గ్రామాలలో కేబుల్ వైర్ల చోరీ వరుసగా జరుగుతుండడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.
వరుస చోరీలతో బెంబేలు : మండల పరిధిలోని గోపతండ, దాని ఆవాస గ్రామమైన గొల్లగూడెం, నేరడవాయి గ్రామాల్లో వరుసగా కేబుల్ వైర్ దొంగతనాలు జరుగుతున్నాయి.
ఇప్పటికే 100 మోటార్ల వద్ద కేబుల్ వైర్లను దొంగలు కత్తిరించుకుపోయినట్లు రైతులు చెబుతున్నారు. బుధవారం కూడా పలువురు రైతుల మోటార్ల కేబుల్ వైర్ దొంగలించడం గమనించదగ్గ విషయం. సబ్ మెర్సిబుల్ మోటార్ నుంచి మెయిన్ బోర్డు వరకు ఉండే కేబుల్ వైర్లు కట్ చేసి తీసుకువెళ్లగా బాధిత రైతులు లబోదిబోమన్నారు. ఇప్పటివరకు మొత్తం 100 మోటార్ల వరకు లెక్క తేలాయని బాధిత రైతులు పెరుగు యాదగిరి కావిటి నవీన్ పెరుగు నర్సయ్య పెరుగు రమేష్ తదితర రైతులు తెలిపారు.
మీటర్ల కొద్ది వైర్ మాయం: ఒక్కో మోటార్ వద్ద సుమారు 40 నుంచి 50 మీటర్ల కేబుల్ వైరును దొంగలు కత్తిరించుక వెళ్తున్నట్టు బాధిత రైతులు చెబుతున్నారు. ఒక్క మీటర్ కేబుల్ వైరు సుమారు రూ.200- 250 వరకు ఉంటుందని ఈ లెక్కన 100 మోటార్ల వద్ద సుమారు నాలుగు లక్షల రూపాయల విలువైన కేబుల్ వైర్లు కత్తిరించక పోయారని బాధిత రైతులు చెప్పారు. గతంలో కూడా రెండుసార్లు కేబుల్ వైర్లు కట్ చేశారని, ఇది మూడోసారి అని రైతులు పేర్కొన్నారు.
రెండుసార్లు ఇలాంటి సంఘటనలు జరగగా పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎటువంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. చెరువుకట్టపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లయితే దొంగలు దొరుకుతారని ఆ దిశగా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పంటకు నీరు పెట్టాలంటే మళ్ళీ ప్రతి మోటారుకు రూ.4_ 5 వేల వరకు ఖర్చు చేసి కేబుల్ వైరు కొనాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా పోలీసులు రాత్రి సమయాల్లో గట్టిగా నిఘా పెట్టి దొంగలను పట్టుకొని కేబుల్ వైర్ల చోరీకి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని రైతులు కోరుతున్నారు.
చోరీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
దొంగలు వరుసగా కేబుల్ వైర్లు దొంగిలించడం వల్ల పొట్ట దశలో పంటకు నీరు లేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒకరు ఇద్దరి రైతులవే కాకుండా వందల మంది రైతుల కేబుల్ వైర్లను దొంగలు ఎత్తుకెళ్తున్నారు. దీంతో రైతులంతా అవస్థలు పడాల్సి వస్తుంది. కావున పోలీసులు అధికారులు ఈ వరుస దొంగతనాలపై దృష్టి సారించి సంబంధిత వ్యక్తులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి.
- పెరుగు యాదగిరి, బాధిత రైతు




