07-10-2025 01:02:33 AM
హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్‌పై దాఖలైన రిట్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు డిస్మిస్ చేసిందని, అంతమాత్రాన కాంగ్రెస్ నాయకులు తామేదో సాధించామని గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మండిపడ్డారు. నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే హైకోర్టులో న్యాయనిపుణులతో వాదనలు వినిపించి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు ముందుగా అక్కడే వాదనలు వినిపించాలని సుప్రీంకోర్టు చెప్పడం సహజ ప్రక్రియ అని పేర్కొన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ పిటిషన్ విషయంలో రాష్ట్ర మంత్రులు పెద్ద హడావుడి చేసి ఏదో సాధిస్తామంటూ తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్లారని మండిపడ్డారు. సుప్రీం కోర్టులో డిస్మిస్ కావడానికి కారణం హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటం మాత్రమేనని స్పష్టంచేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కావాలని బీజేపీ మొదటి నుంచీ కోరుతోందని, ఇందుకు మద్దతు ఇచ్చామని, దానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు.
బస్సు చార్జీల పెంపును విరమించుకోవాలి
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, పేద, మధ్యతరగతి వర్గాలపై సిటీ బస్సు చార్జీలను పెంచి భారం మోపిందని రాంచందర్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక చేతితో ఇచ్చి, మరో చేతితో లాక్కోవడమనేది కాంగ్రెస్ ప్రభుత్వ పాలసీ అని దుయ్యబట్టారు. హైదరాబాద్ -సికింద్రాబాద్‌లో సిటీ బస్సుల కనీస చార్జీని ఒక్కసారిగా రూ.10 పెంచడంతో పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుందన్నారు. రాష్ర్ట ప్రభుత్వం వెంటనే చార్జీల పెంపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
త్వరలోనే అభ్యర్థి ఎంపిక
జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభ్యర్థి ఎంపికకు అభిప్రాయాలు సేకరించేందుకు ముగ్గు రు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని రాంచందర్‌రావు చెప్పారు. కమిటీలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎంపీ రాములు, కోమల ఆంజనేయులు ఉ న్నారని, కమిటీ ద్వారా పార్టీ నాయకుల అభిప్రాయాలను సేకరించి, అభ్యర్థిని ప్రకటిస్తా మన్నారు. జూబ్లీహిల్స్‌లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలి పారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి పలువురు ముస్లిం మైనారిటీ నాయకులు, కార్యకర్తలు రాంచందర్‌రావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.