యువత హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది
- కేంద్ర ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోంది
- డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): దేశ యువత భవిష్యత్తుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క విమర్శించారు. శనివారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ యువత హక్కుల పరిరక్షణ, ఉద్యోగ అవకాశాల పెంపు, నాణ్యమైన విద్య కోసం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాటం కొనసాగిస్తోందని తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల రద్దులు, ఉద్యోగ నియామకాలలో జాప్యాల కారణంగా లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆమె పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పలు పోటీ పరీక్షల్లో తరచూ అవకతవకలు చోటుచేసుకోవడం వల్ల యువతలో నమ్మకం సన్నగిల్లుతోందన్నారు.ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ ఉద్యోగాల భర్తీపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉన్నత విద్య, పరిశోధన రంగాలకు మరింత నిధులు కేటాయించి యువతకు మెరుగైన అవకాశాలు కల్పించాలని కోరారు.తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసి వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.దేశ యువత హక్కుల పరిరక్షణ, ఉద్యోగ అవకాశాల పెంపు, విద్యా రంగ సంస్కరణల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, విద్యార్థులు, యువత సమస్యల పరిష్కారానికి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.






