20 June, 2026 | 7:45 PM

మధిర కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్

20-06-2026 06:36 PM

మధిర,(విజయక్రాంతి): మధిర కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఘనంగా మధిర జూనియర్ సివిల్ జడ్జి దీప్తి వేముల ప్రారంభించారు. ఈ సందర్భంగా మధిర జూనియర్ సివిల్ జడ్జి దీప్తి వేముల మాట్లాడుతూ....లోక్ అదాలత్ ద్వారా పెండింగ్‌లో ఉన్న కేసులను పరస్పర రాజీ ద్వారా త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. న్యాయస్థానాల్లో సంవత్సరాల పాటు కొనసాగే వివాదాలను సులభంగా, తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో పరిష్కరించేందుకు లోక్ అదాలత్‌ లు ఉత్తమ వేదికల ని ఆమె పేర్కొన్నారు.

ముఖ్యంగా చెక్కు బౌన్స్ కేసులు, మోటార్ ప్రమాద పరిహార కేసులు, బ్యాంకు రుణాలు, కుటుంబ వివాదాలు తదితర కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి అనేక సివిల్, క్రిమినల్ కేసులను ప్రజల ముందు పరిష్కరించి అవార్డు కాపీలు అందజేశారు. లోక్ అదాలత్‌లో కుదిరిన రాజీ తీర్పులకు చట్టబద్ధత ఉండటంతో పాటు వాటిపై అప్పీల్‌కు అవకాశం ఉండదని, ఇరు పక్షాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆమె వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వివాదాలను సామ రస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.