2 August, 2026 | 6:16 PM

నిలువెల్లా నిర్లక్ష్యమే!

24-08-2024 01:15 AM

నల్లగొండ దవాఖానలో వైద్యుల నిర్వాకం.. కుర్చీలోనే గర్భిణీ ప్రసవం

దేవరకొండ దవాఖానలో గర్భిణికి అందని వైద్యం 

వైద్యులు లేరని వెనక్కి పంపించిన సిబ్బంది 

ఘటనపై కలెక్టర్ ఆరా.. విచారణకు ఆదేశం 

ఎంసీహెచ్ వైద్యురాలు, స్టాఫ్ నర్సులకు షోకాజ్‌లు

దేవరకొండ వైద్యురాలు, స్టాఫ్ నర్సుల సస్పెన్షన్‌కు ఆదేశం

నల్లగొండ, ఆగస్టు 23 (విజయక్రాంతి): గర్భిణులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. వారికి మెరుగైన వైద్యసేవలు అందించే బాధ్యత ప్రభుత్వ దవాఖానాలది. అయితే దవాఖానాల్లోని కొందరు వైద్యులు, సిబ్బంది మాత్రం విధుల్లో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. గర్భిణులకు సకాలంలో సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. గురువారం రాత్రి నల్లగొండ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో గర్భిణి కుర్చీలోనే ప్రసవించడం అందుకు నిదర్శనం.

దేవరకొండ సర్కార్ దవాఖానలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించింది. ప్రసవం కోసం వచ్చిన గర్భిణికి సకాలంలో వైద్యసాయం అందించకపోవడంతో తీవ్ర రక్తస్రావంతో బిడ్డకు జన్మనివ్వాల్సి వచ్చింది. నల్లగొండ జిల్లా నేరెడుగొమ్ము మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి అశ్విని మూడో కాన్పు కోసం భర్త ఆంజనేయులుతోపాటు ఆమె తల్లిదండ్రులతో కలిసి గురువారం రాత్రి 10 గంటల సమయంలో దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు వెళ్లింది. వైద్యులు అందుబాటులో లేరని జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్)కు వెళ్లాలని సిబ్బం ది సూచించారు.

దీంతో వారు ప్రభుత్వ దవాఖాన అంబులెన్స్‌లో అర్ధరాత్రి ఒంటిగంటకు నల్లగొండ ఎంసీహెచ్‌కు వెళ్లారు. అశ్విని పురిటినొప్పులతో బాధపడుతున్నప్పటికీ సిబ్బంది స్పందించలేదు. దీంతో అశ్విని కుర్చీలోనే కూర్చున్నది. కొద్దిసేపటి తర్వాత రక్తస్రావంతో ప్రసవించింది. అప్పుడు వైద్యులు స్పందించి తల్లీబిడ్డకు వైద్యసాయం అందించారు. ఘటనపై దవాఖాన సూపరింటెండెంట్‌తో పాటు గైనకాలజీ హెచ్‌వోడీని వివరణ కోరగా.. ‘తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో ఓ గర్భిణి ప్రసవం కోసం వచ్చింది. అప్పటికే కేసులు చాలా ఉండడంతో సిబ్బంది కాసేపు కుర్చీలో కూర్చోమని చెప్పారు. మూడో కాన్పు కావడంతో నొప్పులు వచ్చిన వెంటనే ప్రసవం జరిగే అవకాశాలు ఎక్కువ. అందుకే వెంటనే ప్రసవం జరిగింది. విధుల్లో సిబ్బంది ఎవరూ నిర్లక్ష్యం వ్యవహరించ లేదు’ అని సమాధానమిచ్చారు.

విచారణకు ఆదేశం..

కుర్చీలోనే గర్భిణి ప్రసవం ఘటనపై కలెక్టర్ నారాయణరెడ్డి స్పందించారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ పూర్ణచందర్‌ను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం దవాఖానకు వచ్చిన అదనపు కలెక్టర్ గర్భిణి కుటుంబీకులను విచారించారు. ఘటనపై పూర్తి నివేదిక తయారు చేసి కలెక్టర్‌కు అందించనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. బాధ్యులైన వైద్యురాలు నిఖితతో పాటు స్టాఫ్ నర్సులు ప్రమీల, ఉష, పద్మ, సుజాతకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు.

వారి నుంచి సమాధానం వచ్చిన తరువాత శాఖాపరమైన చర్యలుంటాయన్నారు. దేవరకొండ ప్రభుత్వ దవాఖానలో గురువారం రాత్రి విధుల్లో ఉండాల్సిన వైద్యురాలు శాంతి స్వరూప అందుబాటులో లేకపోవడంతో పాటు మత్తు ఇంజెక్షన్ ఇచ్చే డాక్టర్ లేకపోవడంతోనే వైద్యులు నల్లగొండకు వెళ్లమని చెప్పినట్లు తెలిసిందన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యురాలు శాంతిస్వరూపతోపాటు స్టాఫ్ నర్సులు విజయలక్ష్మి, సైదమ్మ, మౌనిక, సరితను సస్పెండ్ చేయాలని డీసీహెచ్‌ఎస్‌ను ఆదేశించామని స్పష్టం చేశారు. సర్కారు దవాఖానల్లో ప్రసవాలను అధికంగా చేయాలని ప్రభుత్వం సూచిస్తుంటే.. వైద్యులు, సిబ్బంది అందుకు భిన్నంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నొప్పులు వచ్చినా ప్రసవం చేయలేదు

గురువారం రాత్రి నా భార్య అశ్వినిని కాన్పు కోసం దేవరకొండ ప్రభు త్వ దవాఖానకు తీసుకెళ్లా. అక్కడ వైద్యులు అందుబాటులో లేరని చెప్పడంతో వైద్య సిబ్బంది నల్లగొండకు వెళ్లమని సూచించారు. ఒంటిగంట ప్రాంతంలో మేం మాతాశిశు సంరక్షణ కేంద్రానికి వెళ్లాం. నర్సులు నా భార్యను పరీక్షించి నొప్పులు నెమ్మదిగా వస్తున్నాయని, కాన్పుకు చాలా సమయం పడుతుందని చెప్పారు. నొప్పులు వస్తున్నా  ప్రసవం చేయలేదు. నొప్పులు అధికం కావడంతో అశ్విని కుర్చీలోనే ప్రసవించింది. దేవరకొండ ప్రభుత్వ దవాఖాన సిబ్బంది నిర్లక్ష్యంతోనే పరిస్థితి. వారు సకాలంలో వైద్యసాయం అందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.

 నల్లవెల్లి ఆంజనేయులు, 

అశ్విని భర్త