2 August, 2026 | 7:16 PM

రుణమాఫీ మాకెందుగ్గాలె?

24-08-2024 01:13 AM

కొరకరాని కొయ్యగా 15 రకాల సాంకేతిక సమస్యలు 

నిబంధనల కొర్రీలు, ఆంక్షలతో రైతులకు చుక్కెదురు

 నోడల్ ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు 

ప్రతి జిల్లాలో వేలాదిగా దరఖాస్తుల సమర్పణ

బ్యాంకుల్లో రుణం తీసుకున్న రైతులకు గుబులు తీరలేదు. సాంకేతిక సమస్యలతో రుణం తీరలేదు. రేషన్‌కార్డులు లేకపోవడం.. ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, రుణ ఖాతాల్లో తప్పులు.. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకోవడం.. కుటుంబ సభ్యుల్లో మరొకరు రుణాలు తీసుకున్నారని తేలడం.. తీసుకున్న రుణానికి వడ్డీ కలిపి రూ.2 లక్షలు దాటడం.. ఇలా మొత్తం అధికారులు 15 రకాల సాంకేతిక సమస్యలు, కొర్రీలతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదు.

మాఫీ వర్తించని రైతుల కోసం సర్కార్ ప్రతి మండలంలో నోడల్ అధికారిని నియమించినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది. రైతుల సందేహాలను వారు నివృత్తి చేయలేకపోతున్నారు. దీంతో రైతులు బ్యాంకర్లను సంప్రదించాలా.. లేదా.. వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలా తెలియక సతమతమవు తున్నారు. ‘ఎక్కే మెట్టు.. దిగే మెట్టు’ అన్నట్లు బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. మాఫీ వర్తించకుండా సర్కార్ లేనిపోని కొర్రీలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విజయక్రాంతి నెట్‌వర్క్, ఆగస్టు 23: రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ తమకు వర్తించని రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. మాఫీ కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సర్కార్ మూడు విడతలుగా రుణమాఫీ చేయగా అర్హులమైన తమకు మాఫీ కాలేదని వాపోతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు, బ్యాంకర్ల సమన్వయ లోపంతోనే అర్హులకు సైతం రుణమాఫీ కాలేదని ఆరోపిస్తున్నారు.

రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సర్కార్ ప్రతి మండలంలో ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించినప్పటికీ వారు రైతులకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇచ్చిన హామీని సంపూర్ణంగా అమలు చేయాల్సిన ప్రభుత్వం లేనిపోని ఆంక్షలు విధించడంతోనే ఈ పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా 30 నుంచి 40 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయిందని రైతులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు అధికారులు ఇప్పటికే రుణమాఫీలో 15 రకాల సాంకేతిక సమస్యలను గుర్తించి ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. గత ప్రభుత్వం వ్యక్తిని యూనిట్‌గా తీసుకొని రుణమాఫీ చేయడం.. వివరాలు సేకరించేందుకు సుదీర్ఘ సమయం తీసుకోవడంతో సమస్యలు పెద్దగా ఉత్పన్నం కాలేదు. ప్రస్తుత ప్రభుత్వం కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకోవడం హడావిడిగా వివరాలు సేకరించడంతో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైనట్లు అధికారులే చెబుతున్నారు. ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌ల్లో తప్పొప్పులు, రేషన్ కార్డుల లేకపోవడం వంటి సమస్యల కారణంగా రుణమాఫీ కాలేదని మరికొందరు చెప్తున్నారు.

నల్లగొండలో..

నల్లగొండ జిల్లాలో మూడు విడుతల్లో 72,785 ఖాతాల్లో రూ.1,433.506 కోట్లు జమ అయ్యాయి. మరో 30 శాతానికిపైగా అర్హులకు రుణమాపీ కావాల్సి ఉన్నది. 

నాగర్‌కర్నూల్‌లో..

నాగర్‌కర్నూల్ జిల్లాలో 1,02,467 మంది రైతులకు రూ.854.28 కోట్ల రుణమాఫీ అయింది. జిల్లావ్యాప్తంగా 5,500 మందికి రుణమాఫీ వర్తించలేదు.

నిర్మల్‌లో..

నిర్మల్ జిల్లాలో మూడు విడతల్లో మొత్తం 64,742 మంది రైతులకు రూ.588.94 కోట్ల రుణమాఫీ అయింది. జిల్లాలో మరో 15 వేల మంది అర్హులున్నప్పటికీ వారికి రుణమాఫీ కాలేదని తెలుస్తున్నది. భద్రాద్రి జిల్లాలో 57,983 మంది రైతులకు రుణమాఫీ కాగా వారి ఖాతాల్లో రూ.415.27 కోట్లు జమయ్యాయి. మరో 1,41,203 మందికి రుణమాఫీ వర్తించలేదు.

నిజమాబాద్‌లో...

నిజమాబాద్ జిల్లాలో 2.75 లక్షల మంది రైతులు రుణాలు తీసుకోగా, వీరిలో కేవలం 83,061 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. మిగతా 1,91,939 మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో 

రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 3,22,010 మంది రైతులు రుణాలు తీసుకొన్నారు. వీరిలో 87,612 మంది రైతులకు రూ.660 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి.

సూర్యాపేటలో

సూర్యాపేట జిల్లాలో కేవలం 60 శాతం మందికే రుణమాపీ అయింది. తొలి విడతలో 56,217 మంది రైతులకు 282.78 కోట్లు, రెండో విడతలో 26,376 మందికి 250.07 కోట్లు, మూడో విడతలో 12,757 మంది రైతులకు రూ. 213.24 కోట్ల రుణమాఫీ జరిగింది. ఇలా మూడు విడతల్లో 95,250 మంది రైతులకు లబ్ధి చేకూరింది.  

సంగారెడ్డిలో.. 

జిల్లాలో 98108 మంది రైతులకు రూ.848.01 రుణమాఫీ జరిగింది. మరో 4,077 మందికి రుణాలు మాఫీ కాలేదు.

వనపర్తి జిల్లాలో..

మొదటి విడతలో 27,066 మంది రైతులకు రూ.145 కోట్ల రుణం మాఫీ కాగా మరో 1,342 మంది రుణాలు మాఫీ కాలేదు. రెండో విడతలో 16,161 మంది రైతులకు రూ.151 కోట్ల రుణమాఫీ అయింది. మరో 366 మంది రైతుల రుణం మాఫీ కాలేదు. మూడో విడతలో 10,018 మంది రైతులకు రూ.126 కోట్ల రుణం మాఫీ కాగా, 29 మంది రైతులకు రుణమాఫీ కాలేదు.

యాదాద్రిలో..

యాదాద్రి భువనగిరి జిల్లాలో 64,289 మంది రైతులు బ్యాంకుల నుంచి రూ.522.44 కోట్ల రుణం పొందారు. 50 శాతం మందికి మాఫీ వర్తించింది.

ఖమ్మంలో..

ఖమ్మం జిల్లావ్యాప్తంగా 3.71 లక్షల మంది రుణం తీసుకోగా కేవలం 1.15 లక్షల మందికే రుణమాఫీ అయింది.

కామారెడ్డి జిల్లాలో..

కామారెడ్డి జిల్లాలో 1.60 లక్షలమంది రుణం తీసుకోగా 91,899 రైతులకు రుణమాఫీ వర్తించింది. వారి రూ.655.37 కోట్ల రుణం మాఫీ అయింది. ఇలా అన్ని జిల్లాల్లో దాదాపు అదే పరిస్థితి ఉన్నది. 

ఉమ్మడి వరంగల్ జిల్లాలో..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడోవిడతలో 44,462 మంది రైతులు రుణమాఫీ ద్వారా లబ్ధిపొందారు. హనుమకొండ జిల్లాలో 7,451 మంది రైతులు, వరంగల్ జిల్లాలో 9378 మంది రైతులు, భూపాలపల్లి జిల్లాలో 7670 మంది, మహబూబాబాద్ జిల్లాలో 14,253 మంది, ములుగు జిల్లాలో 4,833 మంది, జనగామ జిల్లాలో 11,064 మందికి సంబంధించిన రూ.7,35, 27,34,584 కోట్ల రుణం మాఫీ అయింది.

మహబూబ్‌నగర్ జిల్లాలో..

మహబూబ్‌నగర్ జిల్లాలో రుణాలు తీసుకున్నవారు 43,881 మంది ఉండగా, వీరిలో 42,291 మందికి మొదటి విడతలో రుణమాఫీ అయింది. వారి ఖాతాల్లో రూ.232.45 కోట్లు జమయ్యాయి. మరో 1,590 మందికి రుణమాఫీ కావాల్సి ఉన్నది. రెండో విడతలో రూ.లక్షన్నర వరకు రుణాలు తీసుకున్న వారిలో 22,253 మంది రైతులు ఉన్నారు. వీరిలో 22,148 మందికి రుణమాఫీ అయింది. వీరి ఖాతాల్లో రూ.218.27 కోట్లు జమయ్యాయి. మరో 105 మందికి మాఫీ కావాల్సి ఉన్నది. మూడో విడతలో రూ.2 లక్షల వరకు 13,455 మంది రైతులు రుణం తీసుకోగా, వీరిలో 13,406 మందికి రుణమాఫీ అయింది. వారి ఖాతాల్లో రూ.161.44 కోట్లు జమయ్యాయి. మరో 48 మందికి రుణమాఫీ కాలేదు. 

నాకు రుణమాఫీ కాలేదు..

నేను కల్లూర్ తెలంగాణ డెక్కన్ గ్రామీణ బ్యాంకులో రూ.1.95 లక్షల రుణం తీసుకున్నా. మూడో విడతలో నాకు రుణమాఫీ కాలేదు. రూ.2 లక్షలలోపు రుణమే అయినా నాకు మాఫీ ఎందుకు కాలేదో అర్థం కావడం లేదు. అధికారులను అడిగితే వడ్డీతో కలిపి రుణం రూ.2,00,600 అయిందంటున్నారు. తీసుకున్న రుణాన్ని మాత్రమే ప్రభుత్వం పరిగణలోని తీసుకోవాలి. వడ్డీని కలపొద్దు.

 నర్సయ్య, రైతు, పెంచికల్ పహాడ్, నిర్మల్ జిల్లా

రేషన్ కార్డు లేకపోవడంతో రుణమాఫీ కాలేదు..

నాకు మూడెకరాల పొలం ఉండడంతో బ్యాంకులో రూ.లక్ష రుణం తీసుకున్నా. కుటుంబ సభ్యుల్లో ఇంకెవరికీ వ్యవసాయ రుణం లేదు. అర్హత ఉన్నా రేషన్ కార్డు లేకపోడడంతో రుణమాఫీ కాలేదు. బ్యాంకర్లను సంప్రదిస్తే తమ వద్ద వివరాలు సక్రమంగానే ఉన్నాయని, వ్యవసాయాధికారిని సంప్రదించాలని సూచించారు. 

 షేక్ నవాంబీ, రైతు, పూసల పహాడ్, 

మాడుగులపల్లి మండలం, నల్లగొండ జిల్లా

ఇబ్బంది పడుతున్నా..

నేను బ్యాంకులో రూ.1.50 లక్షల రుణం తీసుకున్నా. ఇటీవల రుణాన్ని రెన్యువల్  చేశాను. నాకు రుణమాఫీ వర్తించలేదు. మండల వ్యవసాయ అధికారి వద్దకు వెళ్లి మాఫీ గురించి అడిగాను. నాకు రుణమాఫీ వర్తించినప్పటికీ ఓ కంపెనీ నా పేరుపై రుణం తీసుకుందని సమాధానమిచ్చారు. ఫ్యాక్టరీ యజమాన్యం రుణాన్ని చెల్లించగానే మాఫీ వర్తిస్తుందన్నారు. ఇలాంటి కొర్రీలు పెడితే ఎలా..? ప్రభుత్వం ఆంక్షలు లేకుండానే రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలి.

 లక్కాకుల బాల్‌రాజు, రైతు, 

పాతరాజంపేట్, కామారెడ్డి జిల్లా