15 March, 2026 | 3:32 PM

నియోజకవర్గ అభివృద్దే ప్రధాన లక్ష్యం

15-03-2026 02:19 PM

2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో ఎలాంటి వెనుకడుగు ఉండదని, ప్రతి కాలనీకి అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా కల్పిస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, అదే దిశగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కూడా సమగ్ర అభివృద్ధి సాధించడానికి కృషి చేస్తున్నామన్నారు.

ఆదివారం వడ్డేపల్లి 58వ డివిజన్ ఎస్సీ కాలనీలో, 9వ డివిజన్ కాకతీయ కాలనీలో, 10వ డివిజన్ అలంకార్ జంక్షన్ లో సిసి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు 2 కోట్ల రూపాయలతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో జరగని అభివృద్ధి తాము రెండు సంవత్సరాల్లోనే వేగవంతంగా పనులను పూర్తి చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు.

ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వాటిని తక్షణమే పరిష్కరిస్తున్నామని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరగాలంటే స్థానిక ప్రజల సహకారం కూడా అవసరమని, ప్రజలు సహకరిస్తే మరింత వేగవంతంగా అభివృద్ధి సాధ్యమవుతుందని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు, 58వ డివిజన్ అధ్యక్షులు తాళ్లపల్లి సుధాకర్, కాంగ్రెస్ శ్రేణులు మండల సమ్మయ్య, కరాబు రాజేశ్వరరావు, తాళ్లపల్లి మేరీ, తాళ్లపల్లి రవీందర్ (జెకె), తాళ్లపల్లి విజయ్, బోసు, మాచర్ల చేరాలు, ఎడ్ల కిషన్, రిషి కుమార్, అక్షయ్, అధికారులు, కార్యకర్తలు, ప్రజలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.