హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం వేగవంతం చేయాలి: బీజేపీ ఆందోళన
మానేరు వాగులో నిలబడి నిరసన వ్యక్తం చేసిన నాయకులు
గంభీరావుపేట,(విజయక్రాంతి): మానేరు వాగుపై నిర్మించ తలపెట్టిన హై లెవెల్ బ్రిడ్జి పనులను వెంటనే వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం గంభీరావుపేట-లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగులోనే నిలబడి బీజేపీ మండల అధ్యక్షుడు కోడె రమేష్ ఆధ్వర్యంలో నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కోడె రమేష్ మాట్లాడుతూ, నాలుగేళ్లుగా బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ పూర్తి కాకపోవడం బాధాకరమని అన్నారు.
ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా పనులు ఆలస్యం కావడం సిగ్గుచేటని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, ప్రారంభించినప్పటికీ బ్రిడ్జి నిర్మానాన్ని పట్టించుకోకపోవడం సిగ్గుచేటని, వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు. వెంటనే సంబంధిత ప్రజాప్రతినిధులు స్పందించి పనులు పూర్తి చేయకపోతే బాధ్యత వహించాలని, అవసరమైతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇటీవల కురిసిన వర్షాలతో ఎగువ మానేరు నిండుకుండలా మారినప్పటికీ, బ్రిడ్జి పనుల పురోగతిపై అధికారులు,నాయకులు ప్రజాప్రతినిధులు దృష్టి సారించడం లేదని ఆరోపించారు. ఎగువ మానేరుకు పూజలు చేస్తున్నారే తప్ప హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయో నాయకులు పరిశీలించకపోవడం బాధాకరమని, ప్రతి వర్షాకాలంలో మట్టి రహదారి కొట్టుకుపోవడంతో నెలల తరబడి రాకపోకలు అంతరాయం కలుగుతున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ సత్యనారాయణ, నాయకులు పత్తి స్వామిరాజ్, సర్వోత్తమ్ నర్సింలు దేవేందర్, రాజు బండ దేవయ్య దేవేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






