7 August, 2026 | 2:58 PM

తల్లిపాలే బిడ్డకు తొలి కవచం..!

07-08-2026 02:22 PM

- పుట్టిన గంటలోపే ముర్రుపాలు శిశువుకు తొలి టీకా

- గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించిన సర్పంచ్ పద్మ తిరుపతి

కోటపల్లి,(విజయక్రాంతి): తల్లిపాల ప్రాధాన్యాన్ని ప్రతి తల్లికి తెలియజేయాలనే లక్ష్యంతో జనగామ గ్రామపంచాయతీ పరిధిలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సర్పంచ్ మారిశెట్టి పద్మ తిరుపతి ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. తల్లిపాలు నవజాత శిశువులకు ప్రకృతి ప్రసాదించిన అమృతం వంటివన్నారు.

బిడ్డ పుట్టిన గంటలోపే అందించే ముర్రుపాలు శిశువుకు తొలి టీకాగా పనిచేస్తాయని పేర్కొన్నారు. ముర్రుపాలలో ఉండే రోగనిరోధక శక్తి శిశువును అనేక అనారోగ్యాల నుంచి కాపాడటంతో పాటు భవిష్యత్తులో ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు దోహదపడుతుందని తెలిపారు. ప్రతి తల్లి తప్పనిసరిగా బిడ్డకు తల్లిపాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  అంగన్వాడీ ఉపాధ్యాయురాలు దీప, మమత, చిన్నక్క, వెంకటలక్ష్మి, సుజాత, ఆశా వర్కర్ రాజ్‌బీ ,గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులుతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.