7 August, 2026 | 3:06 PM

విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు సర్వీస్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పోచారం

07-08-2026 02:28 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని పలు గ్రామాల విద్యార్థులకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీస్ లను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు  ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేశారు.బాన్సువాడ పట్టణం నుండి తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అభివృద్ధి పనుల నిమిత్తం వెళుతుండగా, మార్గమధ్యంలో కిష్టాపూర్ గ్రామ బస్టాండ్ వద్ద సుమారు 20 మంది విద్యార్థులు బస్సు కోసం వేచి ఉండడం గమనించారు.

వెంటనే వాహనాన్ని ఆపి విద్యార్థులను ప్రశ్నించగా, బస్సులు సమయానికి రాకపోవడంతో ముందుగా బాన్సువాడకు వెళ్లి అక్కడి నుండి మరో బస్సులో SRNK డిగ్రీ కళాశాలకు చేరుకోవాల్సి వస్తోందని, దీంతో సమయానికి కాలేజీకి చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు.విద్యార్థుల సమస్యను గమనించిన పోచారం వెంటనే బాన్సువాడ డిపో మేనేజర్  రవికుమార్ తో ఫోన్‌లో మాట్లాడి, బాన్సువాడ నుండి SRNK డిగ్రీ కళాశాల వరకు బీర్కూర్, కిష్టాపూర్, తిమ్మాపూర్, బొమ్మందేవ్‌పల్లి చౌరస్తా మార్గంగా ఉదయం ప్రత్యేక బస్సు సర్వీసును ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

అదేవిధంగా, విద్యార్థినులు సమయానికి కాలేజీలకు చేరుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని, ముఖ్యంగా ఆడబిడ్డల భద్రత దృష్ట్యా ప్రయాణ సౌకర్యం అత్యంత అవసరమని పేర్కొంటూ, ఉదయం,సాయంత్రం ప్రత్యేకంగా బస్సు సర్వీసులు నడపాలని సూచించారు.తమ సమస్యపై వెంటనే స్పందించి తక్షణ పరిష్కారం చూపిన పోచారం శ్రీనివాసరెడ్డికి విద్యార్థినులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.