ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్
వెంకటాపూర్, మార్చి 10 (విజయక్రాంతి): ఇళ్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్ సూచించారు.
మంగళవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వెంకటాపూర్ మండల కేంద్రంతో పాటు నల్లగుంట, ఎల్లారెడ్డిపల్లె గ్రామాల్లో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మంజూరైన ఇళ్ల సంఖ్య, పూర్తున ఇళ్ల వివరాలు, ఇంకా నిర్మాణ దశలో ఉన్న పనుల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ను లబ్ధిదారులకు తక్కువ ధరకు అందించి పనులు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటివరకు పూర్తయిన పనుల మేరకు లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయా అని కూడా ఆయన ఆరా తీశారు. పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేస్తే చివరి బిల్లు విడుదల అవుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ పర్యటనలో భాగంగా గ్రామపంచాయతీ నర్సరీని సందర్శించి అక్కడ పెంచుతున్న వివిధ రకాల మొక్కలను పరిశీలించారు.
గ్రామ ప్రజలకు అవసరమైన పండ్ల మొక్కలు, పూల మొక్కలు మరియు రహదారుల ఇరువైపుల నాటేందుకు అనువైన నీడనిచ్చే చెట్ల మొక్కలను ఎక్కువ సంఖ్యలో నర్సరీలో పెంచాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ పర్యటనలో భాగంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, సీసీ కెమెరాల పనితీరు, త్రాగునీటి సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.




