గిద్ద దళితవాడలో మురికి కాలువల నిర్మాణ పనుల ప్రారంభం
25-04-2026 06:53 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండల కేంద్రంలోని గిద్ద దళితవాడలో శనివారం మురికి కాలువల నిర్మాణ పనులను ఘనంగా ప్రారంభించారు. స్థానిక ప్రజల దీర్ఘకాల సమస్యగా ఉన్న మురుగు నీటి పారుదల సమస్యను పరిష్కరించేందుకు ఈ పనులు చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. చేపట్టిన పనులను నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మురికి కాలువల నిర్మాణం పూర్తయితే దళితవాడలో పారిశుద్ధ్యం మెరుగుపడి, ప్రజలకు ఇబ్బందులు తగ్గుతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.






