పాఠశాలలు, వసతి గృహాలపై నిరంతర పర్యవేక్షణ అవసరం
జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 4, (విజయక్రాంతి): జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టనున్న 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా, సమన్వయంతో అమలు చేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో కలిసి ముందుగా జిల్లా అధికారులతో సమగ్ర దిశానిర్దేశం నిర్వహించారు.
అనంతరం జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వార్డు అధికారులు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 6 నుండి జూన్ 12 వరకు వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. మార్చి 6 నుండి మార్చి 15 వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాలలో ఫైళ్ల పరిష్కరణ అంశంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు.
కార్యాలయాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల వేగవంతమైన పరిష్కారం, రికార్డుల సక్రమ నిర్వహణ, ప్రజలకు సమయానుకూల సేవలందించడం లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. . మే 4 నుండి మే 9 వరకు రైతులు (వ్యవసాయం( అంశంపై వ్యవసాయ, రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్ శాఖలు సమన్వయంతో రైతులకు సాగు సలహాలు, ఎరువులువిత్తనాల లభ్యత, సాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్ సరఫరా అంశాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మే 11 నుండి మే 16 వరకు విద్య అంశంపై పాఠశాలల మౌలిక వసతులు, పరిశుభ్రత, విద్యార్థుల హాజరు, బోధన నాణ్యతపై సమీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు. మే 18 నుండి మే 23 వరకు యువత,క్రీడలు అంశంపై క్రీడా పోటీలు, యువజనోత్సవాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు చేపట్టాలని సూచించారు. మే 25 నుండి మే 30 వరకు మహిళలు అంశంపై మహిళా సాధికారత, స్వయం ఉపాధి, స్వయం సహాయక సంఘాల బలోపేతం, రుణాల సద్వినియోగంపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జూన్ 1 నుండి జూన్ 12 వరకు పర్యావరణం అంశంపై వృక్షారోపణ, ప్లాస్టిక్ నియంత్రణ, పచ్చదనం పెంపు కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. ఈ 99 రోజుల కార్యాచరణ గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ఐదు దశల్లో అమలు చేయబడుతుందని తెలిపారు. మార్చి 6న ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయిలో కార్యాచరణపై గౌరవ మంత్రుల సమీక్ష సమావేశం నిర్వహించబడుతుందని వెల్లడించారు. సంబంధిత శాఖల అధికారులు పూర్తి వివరాలతో సిద్ధంగా హాజరుకావాలని ఆదేశించారు.
స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, సిపిఓ సంజీవరావు, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు, మిషన్ భగీరథ ఈఈ లు తిరుమలేష్, నలిని, ఆర్ అండ్ బి నాగేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి, ఎస్సీ సంక్షేమ శాఖ శ్రీలత సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.




