5 March, 2026 | 8:29 PM

చెరువులో గల్లంతైన గురుకుల విద్యార్థి మృతి

05-03-2026 12:00 AM

రూ. 7.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్

షాద్నగర్, మార్చి 4 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండల పరిధిలో విషాదం చోటుచేసుకుంది.మహాత్మ జ్యోతిరావు పూలే బి.సి. వెల్ఫేర్ గురుకుల వసతి గృహంలో చదువుకుంటున్న రాజు అనే విద్యార్థి చెరువులో పడి మృతి చెందాడు. గత రెండు రోజులు గా గాలింపు చర్యలు చేపట్టిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు బుధవారం నాడు విద్యార్థి మృతదేహాన్ని వెలికితీశాయి.

ఘటనా స్థలంలో ఉద్రిక్తత..

వసతి గృహ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మరణించాడని ఆరోపిస్తూ మృతుడి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో ఘటనా స్థలంలో ఉద్రిక్తత నెలకొంది.సమాచారం అందుకున్న మహబూబ్ నగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధిత కుటుంబంతో మాట్లాడి ప్రభుత్వం తరపున మృతుడి కుటుంబానికి రూ. 7.50 లక్షల ఎక్స్గ్రేషియా తో పాటు  కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం. ప్రభుత్వ పథకం కింద ఒక ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లు ఆయన హామీని ఇచ్చారు.

వసతి గృహ సిబ్బంది పనితీరుపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఆర్డీఓ ఆర్.ఎన్. సరిత పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా షాద్ నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.