28 February, 2026 | 1:11 AM

స్మారక స్థూపం నిర్మాణానికి సహకరించండి

27-02-2026 08:10 PM

సీపీఎం పిలుపు

గుండాల,(విజయక్రాంతి): సీపీఎం మండల కార్యదర్శి, ఆదివాసీ ముద్దుబిడ్డ అమరజీవి జోగ నరసయ్య స్మారక స్థూప నిర్మాణానికి మండల ప్రజలందరూ ఆర్ధికంగా, హార్థికంగా సహకరించాలని శుక్రవారం ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారితో జోగ నర్సయ్య మృతి చెందాడని, మండల పరిధిలోని తూరుబాక గ్రామంలో జన్మించిన జోగ నర్సయ్య విద్యార్థి దశ నుండే విప్లవ కార్యకలాపాలల్లో చురుగ్గా పాల్గొన్నాడని గుర్తు చేశారు.

విద్యార్ది ఉద్యమంలో హాస్టల్ సమస్యలపై సైకిల్ యాత్ర నిర్వహించి విద్యార్థులను చైతన్య పరిచిన ఉద్యమ నేత అని కొనియాడారు. మండల కేంద్రంలో జూనియర్ కళాశాల, ఎస్ ఎం హెచ్ హాస్టల్ కోసం పోరాడి సాధించాడని, జీవో నెంబర్ 03, స్పెషల్ డీఎస్సీ కోసం పోరాటాలు ఉదృతంగా నిర్వహించారన్నారు. 2007 సంవత్సరంలో సీపీఎం పార్టీ సభ్యత్వం తీసుకుని మండలంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఆపాలని, ఓపెన్ కాస్టులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించారన్నారు.

కబడ్డీ క్రీడాకారుడిగా జిల్లా స్థాయిలో ఆయన గుర్తింపు పొందాడని, మండల కేంద్రంలో కొమరం భీం విగ్రహం ఏర్పాటు చేయడం కోసం కృషి చేశారన్నారు. ఆయన ఆశయాల కోసం  ప్రజా పోరాటాలు చేస్తూ, ఆయన స్మారక స్థూపం నిర్మాణానికి మండల ప్రజలందరూ సహకరించాలని రేపాకుల కోరారు. ఈ సమావేశంలో సీపీఎం మండల నాయకులు తోలెం గోపి, దుగ్గి రామ్మూర్తి, పడుగోనిగూడెం ఉప సర్పంచ్ జోగ రాజేష్, కల్తి శేఖర్, గడ్డం క్రిష్ణ, జోగ సారమ్మ, అరెం రామకృష్ణ, దుగ్గి అనిల్, దుగ్గి సత్యం, ఊకే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.