21-02-2026 08:58:45 PM
తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి
హనుమకొండ,(విజయక్రాంతి): బాలల హక్కుల పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి అన్నారు.రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం రోజున హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, విద్యా, వైద్యారోగ్య, కార్మిక, పోలీస్ శాఖల అధికారులు, బాలల న్యాయ మండలి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తో నిర్వహించిన సమీక్షా సమావేశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ రెండు రోజుల పర్యటనల్లో భాగంగా ఆనేక సమస్యలు గుర్తించామని ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని, మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని, హనుమకొండ, వరంగల్ డీఈవోలు సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో గర్భిణీలు, బాలింతలు, ఇమ్యూనైజేషన్ స్టేటస్ వివరాలను అందించాలని హనుమకొండ డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్యను ఆదేశించారు. బాలల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. అదేవిధంగా బాల్య వివాహాలు చేసే కుటుంబాలను ముందుగానే గుర్తించి వాటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని, బాల్య వివాహాలపై నివేదికను అందజేయాలని జిల్లా సంక్షేమ అధికారులకు తెలియజేశారు. త్వరలో బాల్య వివాహ నిషేధ చట్టంపై, బాల్య వివాహాల నిర్మూలనపై, పోక్సో చట్టం పై పెద్ద ఎత్తున అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామని అన్నారు.
ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ జిల్లాలో బాలల కోసం ప్రత్యేకంగా స్టూడెంట్ వెల్నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీని ద్వారా వారి మానసిక వికాస స్థాయిలను గుర్తించి అవసరమైన వారికి ఆత్మస్థైర్యాన్ని కల్పించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.బాలల పరిరక్షణ కమిషన్ సభ్యులు బృందాలుగా మూడు జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా వారు గుర్తించిన అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. అనంతరం బాలల పరిరక్షణ కమిటీ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డికి జిల్లా కలెక్టర్ జ్ఞాపికను అందజేశారు.
ఈ సమీక్షా సమావేశంలో కమిషన్ సభ్యులు మరిపల్లి చందన, బండి అపర్ణ, కంచర్ల వందన గౌడ్, వచన్ కుమార్, ప్రేమలత అగర్వాల్, డీఆర్వో వైవీ గణేష్, ఆర్జేడీ ఝాన్సీ లక్ష్మీ బాయి , జిల్లా సంక్షేమ అధికారులు విశ్వజ, మల్లీశ్వరి, డిఎంహెచ్వోలు డాక్టర్ అప్పయ్య, డాక్టర్ సాంబశివరావు, అడిషనల్ డీసీపీ ఎన్ రవి, భూపాలపల్లి ఆడిషనల్ ఎస్పీ నరేష్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్పర్సన్ లు అనిల్ చందర్ రావు, వసుధ, బాలల న్యాయ మండలి సభ్యులు డాక్టర్ కే.గోపికా రాణి, ఎం.సుభాష్, ఇంచార్జి డిసిపివోలు ఎస్.ప్రవీణ్ కుమార్, ఉమ, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ భాస్కర్, జి తిరుపతి, కార్మిక శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.