10-12-2025 01:08:01 AM
రంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారులు
షాద్‌నగర్‌లో సీజ్ చేసిన రేషన్‌షాపు తెరిచేందుకు రూ.20 వేలు అడిగిన డీటీ
అబ్దుల్లాపూర్‌మెట్, డిసెంబర్ 9: రంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మంగళవారం లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో సీజ్ చేసిన ఓ రేషన్‌షాపును తిరిగి తెరిచేందుకు రూ.20 వేలు లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్ ఏసీబీకి పట్టుబడ్డాడు. సదరు షాపు డీలర్‌పై పీడీఎస్ రైస్ కేసుకు సంబంధించిన విషయంలో షాపును అధికారులు ఇటీవల సీజ్ చేశారు.
దుకాణాన్ని తెరవడానికి సంబంధిత అధికారి అయిన సివిల్ సప్లై ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ హనుమ రవీందర్‌నాయక్‌ను సంప్రదించగా రూ.20 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆ రేషన్ డీలర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారి సూచన మేరకు రేషన్ డీలర్ రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయంలో రవీందర్‌నాయక్‌కు నగదును ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు.
డీటీ నుంచి రూ. 20వేల నగదు స్వాధీనం చేసుకుని నాంపల్లిలోని ఏసీబీ స్పెషల్ కోర్డు న్యాయమూర్తి ముందు హాజరు పరచనునట్లు అధికారులు తెలిపారు. కాగా రంగారెడ్డి జిల్లా భూ రికార్డుల సర్వే ఏడీ శ్రీనివాసును ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం మరవక ముందే, మరోసారి జిల్లాలో ఏసీబీ అధికారులు అవినీతి అధికారిని అరెస్ట్ చేయడం చర్చ నియాంశంగా మారింది.
విద్యుత్ మీటర్ కోసం రూ.20 వేల లంచం
వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చొక్కనపల్లి గ్రామ శివారులో ఓ ఇంట్లో విద్యుత్ మీటర్ బిగించేందుకు విద్యుత్ శాఖ ఇన్‌చార్జి అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) వెంకటేశ్వర్లు రూ.20 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఈ నెల 5న ఏసీబీని ఆశ్రయించాడు. పథకం ప్రకారం మంగళవారం రూ.15 వేలు ఇస్తుండగా ఏసీబీ ఇన్‌చార్జి డీఎస్పీ జగదీష్ చందర్ బృందం పథకం ప్రకారం వల పన్ని విద్యుత్ శాఖ ఏఈని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం జడ్చర్లలోని ఏఈ నివాసంలోనూ సోదాలు చేసినట్టు అధికారులు వెల్లడించారు.