కనిష్కతో కెనడాకు కౌంటర్
- విమాన మృతులకు 23న సంతాపం
- కెనడాలోని భారత కాన్సులేట్ ప్రకటన
వాంకోవర్, జూన్ 19: భారత్‌పై యుద్ధం ప్రకటించిన ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్‌కు ఏకంగా కెనడా పార్లమెంటులోని అసాధారణ గౌరవం ఇవ్వటంతో భారత్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. 1985లో ఖలిస్తానీ ఉగ్రవాదులు పేల్చివేసిన ఎయిర్ ఇండియాకు చెందిన కనిష్క విమాన మృతులకు సంతాపం తెలిపేందుకు భారీ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. దీని ద్వారా కెనడా ప్రభుత్వం ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నదని అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టాలని భావిస్తున్నది.
మాంట్రియల్ న్యూఢిల్లీ మధ్య ప్రయాణించిన ఎయిర్ ఇండియాకు చెందిన 182 కనిష్క విమానాన్ని 1985, జూన్ 23న ఖలిస్తానీ ఉగ్రవాదులు బాంబులతో పేల్చి వేశారు. సరిగ్గా అదే రోజు జూన్ 23న వాంకోవర్‌లోని స్టాన్లీ పార్కులో ఉన్న ఎయిర్ ఇండియా మెమోరియల్ వద్ద సాయంత్రం 6.30 గంటలకు సంతాప కార్యక్రమం నిర్వహిస్తామని కెనడాలోని భారత రాయబార కార్యాలయం బుధవారం ట్వీట్ చేసింది.
329 మంది అమాయకులు బలి
భారత్‌లో ఖలిస్తానీ వేర్పాటువాద ఉద్యమం తీవ్రంగా సాగుతున్న సమయంలో కెనడాలో స్థిరపడిన సిక్కులు కూడా ఆ ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. భారత్‌పై ప్రతీకారం తీర్చుకొనేందుకు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. అందులో భాంగా మాంట్రియల్ మధ్య నడిచిన ఎయిర్ ఇండియా 182 కనిష్క విమానంలో బాంబులు పెట్టారు. విమానం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో మరో అరగంటలో దిగుతుందనగా బాంబులు పేలటంతో అందులో ప్రయాణిస్తున్న 329 మంది మరణించారు. మృతుల్లో 86 మంది చిన్నారులున్నారు.






