నిజ్జర్‌కు కెనడా పార్లమెంటు సంతాపం
సభలో కొద్దిసేపు మౌనం పాటించిన సభ్యులు
వాంకోవర్, జూన్ 19: కెనడా ప్రభుత్వం మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ మృతికి కెనడా పార్లమెంటు కొద్దిసేపు మౌనం పాటించింది. నిజ్జర్ హత్య జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా పార్లమెంటు సభ్యులు సభలో నిలబడి కొద్దిసేపు మౌనం పాటించారు. 2023, జూన్ 18న సర్రేలోని ఓ గురుద్వారాలో ఉన్న నిజ్జర్‌ను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
మంగళవారం (జూన్ 18) కెనడా పార్లమెంటులో కార్యకలాపాలన్నీ ముగిసిన తర్వాత నిజ్జర్ మృతికి సంతాపం తెలుపాలని సభ స్పీకర్ గ్రెగ్ ఫెర్గూస్ రూలింగ్ ఇచ్చారు. ‘సభలోని అన్ని పార్టీల సభ్యులు చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చినందున సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు బ్రిటిషన్ కొలంబియాలోని సర్రేలో హత్యకు గురైన హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్యకు సభలో కొద్దిసేపు సంతాపం తెలుపుతూ మౌనం పాటించాలని నిర్ణయించటం జరిగింది’ అని గ్రెగ్ ప్రకటించారు. దీంతో సభ్యులంతా లేని నిలబడి కొద్దిసేపు మౌనం పాటించారు. నిజ్జర్ హత్య భారత ఏజెంట్లే చేయించారని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించటంతో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే.
ఎవరీ నిజ్జర్?
కెనడా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిక్కు వేర్పాటువాద సంస్థ ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) నాయకుడే హర్దీప్‌సింగ్ నిజ్జర్. భారత్‌లో సిక్కుల కోసం ప్రత్యేక ఖలిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలని, పంజాబ్‌ను భారత్ నుంచి వేరు చేయాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకొన్నది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అతన్ని మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్టుగా ప్రకటించింది. అతని తలపై రూ.10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. నిజ్జర్‌ను భారతీయ నిఘా సంస్థలే చంపించాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంటులో ఆరోపించారు.






