స్పీకర్ పోస్టు బీజేపీకే?
- ఎన్డీఏ భాగస్వాములతో బీజేపీ చర్చలు
- అన్ని పార్టీలను ఒప్పించేందుకు ప్రయత్నం
- మోదీ ఏది చెప్తే అదేనన్న చిన్న పార్టీలు
- టీడీపీ, జేడీయూను ఒప్పించే ప్రయత్నాలు
- వీటికి డిఫ్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే సూచనలు
న్యూఢిల్లీ, జూన్ 19: కొద్దిరోజులుగా తీవ్ర రాజకీయ చర్చనీయాంశంగా మారిన లోక్‌సభ స్పీకర్ పదవిపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. లోక్‌సభలో ఈసారి ఏ పార్టీకి పూర్తిగా మద్దతు లేకపోవటం, టీడీపీ, జేడీయూ పార్టీల మద్దతుతో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కావటంతో లోక్‌సభ స్పీకర్ పదవికి ఈసారి ఎక్కడ లేని ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో ఈ పదవి కోసం బీజేపీ, టీడీపీ, జేడీయూ మధ్య పోటీ నెలకొన్నది. అయితే, ఈ పదవిని తమ అభ్యర్థితోనే భర్తీ చేయాలని బీజేపీ పావులు కదుపుతున్నది. అందులో భాగంగా అన్ని ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతలతో బీజేపీ అగ్రనేతలు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.
చిన్న పార్టీలకు ఓకే
ఎన్డీయే కూటమిలోని చిన్న పార్టీలను స్పీకర్ పదవిపై బీజేపీ నేతలు ఒప్పించినట్టు సమాచారం. ఆయా పార్టీల నేతలకు ఫోన్లు చేస్తున్న బీజేపీ జాతీయ నేతలు.. ‘లోక్‌సభ స్పీకర్ పదవికి మీరు ఎవరినైనా సూచిస్తారా?’ అని అడుగుతున్నట్టు సమాచారం. దీంతో చాలా పార్టీలు ఎవరినీ సూచించలేదని తెలసింది. ‘ప్రధాని నరేంద్రమోదీ ఏ నిర్ణయం తీసుకొన్నా కట్టుబడి ఉంటాం’ అని ఆయా పార్టీల నేతలు అన్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇక పెద్ద పార్టీలైన టీడీపీ, జేడీయూ నేతలను స్పీకర్ పదవిపై ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
డిఫ్యూటీ స్పీకర్ పదవి ఎర!
స్పీకర్ పదవిని వదులుకొంటే డిఫ్యూటీ స్పీకర్ పదవి ఇస్తామని టీడీపీ, జేడీయూ పార్టీలకు బీజేపీ ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. అయితే, ఆ పార్టీలు అందుకు ఒప్పుకొంటాయా లేదా అన్నది ఇంకా తేలలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ, జేడీయూకు కూడా లోక్‌సభలో ఒక బలమైన పదవి అవసరం ఉన్నది. దీంతో ఆ పార్టీలు స్పీకర్ పదవి కోసం పట్టుబడుతున్నట్టు తెలిసింది. ఆంధ్రలో టీడీపీ, బీహార్‌లో జేడీయూ అధికారంలో ఉన్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలకు అధిక నిధులు, సంక్షేమ పథకాలు ఇస్తామని ఆశ చూపి వాటిని దారికి తెచ్చుకొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఆ పార్టీలకు ఇప్పుడు కేంద్రం నుంచి ఇథోధికంగా నిధులు రావటం కూడా ముఖ్యమే. దీంతో స్పీకర్ పదవిపై ఆశలు వదులుకొని డిఫ్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది.
డిఫ్యూటీపై విపక్షం కన్ను
ఈసారి లోక్‌సభలో ప్రతిపక్షాల బలం కూడా భారీగా పెరిగింది. దీంతో సభలో దూకుడుగా వ్యవహరించాలని ఇండియా కూటమి నేతలు ప్రణాళికలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కూటమి కూడా డిఫ్యూటీ స్పీకర్ పదవిని దక్కించుకొనేందుకు పావులు కదుపుతున్నది. డిఫ్యూటీ స్పీకర్ పదవిని తమకు ఇవ్వాలని, లేదంటే స్పీకర్ పదవికి విపక్షాల తరఫున అభ్యర్థిని పోటీలోకి దింపుతామని ఇప్పటికే ఆ కూటమి నేతలు లీకులు వదిలారు. లోక్‌సభ చరిత్రలో ఇప్పటివరకు లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరుగలేదు.






