15 July, 2026 | 6:14 AM

నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కుపాదం మోపాలి

08-06-2024 02:42 AM

కామారెడ్డి, జూన్ 7 (విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రజా ప్రతినిధుల కృషి అభినందనీయమని జడ్పీ చైర్‌పర్సన్ దఫేదార్ శోభ రాజు అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ హాలులో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. గత ఐదేళ్లుగా సభలు, సమావేశాలు సజావుగా నిర్వహించి, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి, పరిష్కరింపజేయడంలో సహకరించిన ప్రజా ప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలను తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నకిలీ విత్తనాల విక్రయదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, వ్యవసాయ రంగాన్ని సమీక్షిస్తూ టాస్క్‌ఫోర్స్ బృందాల ద్వారా తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

రైతులకు అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలు సరిపడా అందించాలని కోరగా, ఇప్పటివరకు 4,600 క్వింటాళ్ల జీలుగ, 1,343 క్వింటాళ్ల జనుము విత్తనాలను రైతులకు అందజేసినట్టు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. కొత్తగా ఏర్పడిన మండలాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ఖాళీలను భర్తీ చేయాలని జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ కోరారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సమాధానం తెలిపారు. సమావేశంలో జడ్పీ సీఈవో చందర్ నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, జడ్పీటీసీ సభ్యులు రాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, నారెడ్డి మోహన్‌రెడ్డి, తిర్మల్ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.