2 March, 2026 | 11:41 PM

ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం

02-03-2026 09:59 PM

– రూ.5 లక్షల రుణం ఇవ్వాలని సిపిఐ ధర్నా

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయంలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం కేటాయించి, గృహ నిర్మాణానికి రూ.5 లక్షల రుణం మంజూరు చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి సోమ నాగరాజు మాట్లాడుతూ... ఇందిరమ్మ కాలనీలో గత 15 సంవత్సరాలుగా నివసిస్తూ అడ్డాకూలీలుగా జీవనం సాగిస్తున్న కుటుంబాలు పూర్తిగా నిరుపేదలేనని తెలిపారు. వీరికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని, రోజువారీ కూలి పనులపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. సిపిఐ మండల శాఖ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీలో సర్వే నిర్వహించి, నిజమైన అర్హుల జాబితాను సిద్ధం చేసి ఎమ్మార్వో గారికి సమర్పించినట్లు తెలిపారు.

నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, కూలి రేట్లు పెరగడం లేదని, సంపాదించిన డబ్బులు ఇంటి అద్దె చెల్లించడానికి సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిరుపేదలకు ఇంటి స్థలం కేటాయించి, రూ.5 లక్షల రుణం మంజూరు చేసి గృహ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఎమ్మార్వో గారు వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని, జిల్లా కలెక్టర్‌తో చర్చించి అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎమ్మార్వో విజయ్ ప్రకాష్ రావు,అంజిరెడ్డి, ప్రకాష్, శంకర్, ఆనందు, రాజయ్య, మల్లవ పోచవ్వ, అరవింద, అంజలి, అనురాధ, పద్మ తదితరులు పాల్గొన్నారు.