26 June, 2026 | 10:00 PM

డీ-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన డీఎస్‌పీ అరుణ్ కుమార్

26-06-2026 09:12 PM

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం డివిజన్ డిఎస్పి, తన సిబ్బందితో కలిసి భద్రాచలంలోని స్థానిక దక్షత డీ-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించి, తెలంగాణా ప్రభుత్వం ద్వారా ఈగల్ టీం, హైదరాబాద్ వారు మంజూరు చేసిన ఆట వస్తువులైన కారమ్ బోర్డ్స్, చెస్ బోర్డ్స్ లను డీ-అడిక్షన్ సెంటర్‌ నిర్వాహకులకు అందజేసి, అక్కడ చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడి, వారికి కాలక్షేపానికి, ఆట విడుపులకు ఆట వస్తువులను పంపిణి చేసినట్లుగా వివరించినారు.

మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలను వివరిస్తూ మరియు మాదక ద్రవ్యాలు, మద్యం మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం క్షీణించడమే కాకుండా, కుటుంబ జీవితం ముక్కలవుతుందని మరియు సమాజంలో గౌరవం పోతుందని హెచ్చరించారు. చికిత్స పూర్తి చేసుకున్న తర్వాత బాధితులు పాత అలవాట్లను పూర్తిగా విస్మరించాలని, ఆత్మవిశ్వాసంతో సమాజంలో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, తమ బంగారు భవిష్యత్తు కోసం విద్య, ఉపాధి మరియు కుటుంబ బాధ్యతలపై దృష్టి సారించాలని సూచించారు.