11 June, 2026 | 1:13 AM

సీపీఐ కలెక్టర్ కార్యాలయం ముట్టడి విజయవంతం

11-06-2026 12:00 AM

ధరలను నియంత్రించకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు  

సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

పాల్వంచ, జూన్ 10, (విజయక్రాంతి): పెంచిన ఇంధన ధరలు తగ్గించాలని, నిత్యావసరాల ధరలను పేదలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన నిరసన ధర్నా ఉత్కంఠ.. ఉద్రిక్తంగా మారింది.

జిల్లాలోని వివిధ మండలాలనుంచి వేలాదిగా తరలివచ్చిన నాయకులు కార్యకర్తలు కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి ధర్నాచేశారు. కలెక్టరేట్ ప్రధాన రహదారిపై భారీ ప్రదర్శన నిర్వహించిన అనంతరం కార్యాలయం ప్రధానద్వారం ముందు నేలపై పడుకొని నిరసన నిరసన తెలిపారు.

శాంతియుత ధర్నాను పోలీసులు అడ్డుకునే ప్రయంత్రం చేయడంతో నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో కడుపుమం డిన కార్యకర్తలు ప్రధాన ద్వారాన్ని తోసుకుంటూ కలెక్టరేట్లోకి చొచ్చుకొని వెళ్లే ప్ర యంత్రం చేయడంతో  తోపులాట చోటుచేసుకుంది. దీంతో కలెక్టరేట్ ప్రాంగణం ఉద్రి క్తం మారింది. ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా మాట్లాడుతూ అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా, దేశంలో మాత్రం ఇంధన ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని విమర్శించారు.

ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి రేషన్ షాపుల ద్వారా అన్నిరకాల నిత్యావసర సరుకులను సబ్సిడీపై అందించకుండా, పేదలకు అందకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. మార్కెట్లో నిత్యం సాగుతున్న బ్లాక్ మార్కెట్ ను అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వ తీరు మార్చుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు, మేయర్ మూడ్ గణేష్, జిల్లా నాయకులు నరాటి ప్రసాద్, సలిగంటి శ్రీనివాస్,  సరెడ్డి పుల్లారెడ్డి, కె సారయ్య, మున్నా లక్ష్మి కుమారి, చండ్ర నరేంద్ర కుమార్, వి పూర్ణచందర్ రావు, జి వీరాస్వామి, కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, రేసు ఎల్లయ్య, మువ్వా వెంకటేశ్వర్ రావు, భూక్యా దస్రు, యు రాహుల్, ఎస్ కె ఫహీమ్, మండలాల కార్యదర్శులు, జిల్లా సమితి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.