11 June, 2026 | 1:14 AM

కౌన్సిలర్ గైర్హాజరుపై వార్డు సభను బహిష్కరించిన ప్రజలు

11-06-2026 12:00 AM

ఇల్లందు, జూన్ 10 (విజయక్రాంతి): ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో బుధవారం నిర్వహించిన వార్డు సభకు కౌన్సిలర్ కొండపల్లి సరిత గైర్హాజరు కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభను బహిష్కరించారు. ముందుగా ప్రకటించిన మేరకు వార్డు ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకున్నప్పటికీ కౌన్సిలర్ హాజరు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, తాగునీరు, డ్రైనేజీ, తెల్ల రేషన్ కార్డులకు సంబంధించిన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంతో పాటు వార్డు అభివృద్ధి పనులు సైతం ముందుకు సాగడం లేదని మండిపడ్డారు. వార్డు సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా మున్సిపాలిటీ అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్ గైర్హాజరుకు నిరసనగా సభను ఏకగ్రీవంగా బహిష్కరించిన ప్రజలు అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందించేందుకు సంతకాల సేకరణ చేపట్టి ఆర్‌ఐకు అందజేశారు.

వార్డులో ఎవరైనా మృతి చెందినా పరామర్శించేందుకు కూడా కౌన్సిలర్ రావడం లేదని, స్మశానవాటికకు నీటి ట్యాంకర్ ఏర్పాటు వంటి సమస్యల పరిష్కారానికి ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి వచ్చిన నాయకురాలు గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేకపోవడం బాధాకరమని పేర్కొంటూ ప్రజల సమస్యలు పట్టించుకోని కౌన్సిలర్ తమకు అవసరం లేదని, వెంటనే స్పందించి వార్డుపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.