13 June, 2026 | 8:51 PM

అటవీ-రెవెన్యూ శాఖలతో జాయింట్ సర్వే నిర్వహించాలి

13-06-2026 07:59 PM

- రైతులు విత్తనాలు వేసుకునేందుకు ఆటంకం కలిగించవద్దు 

- ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్(విజయక్రాంతి): లింగాపూర్ మండలంలో అటవీ అధికారులు, గ్రామస్తుల మధ్య కొనసాగుతున్న సమస్యల నేపథ్యంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి మండలంలో పర్యటించారు. అటవీ అధికారులు సర్వే నిర్వహిస్తున్న ప్రాంతాలను పరిశీలించి, అధికారులతో చర్చించారు. అలాగే పలు గ్రామాల్లో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనందున రైతులు విత్తనాలు వేసుకునేందుకు అటవీ అధికారులు సహకరించాలని కోరారు.

రైతులను ఇబ్బంది పెట్టకుండా వ్యవహరించాలని సూచించారు. అటవీ భూములను పూర్తిస్థాయిలో గుర్తించి పోడు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లింగాపూర్ మండల కేంద్రంలో 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సొంత భవనాలు లేని గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటామని, ప్రధాన రహదారుల నుంచి గ్రామాలకు బీటీ రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు.

అటవీ, రెవెన్యూ శాఖల మధ్య ఉన్న భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రెండు శాఖల అధికారులతో కలిసి వెంటనే జాయింట్ సర్వే నిర్వహించాలని సూచించారు. సర్వే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఈ సర్వే ద్వారా పోడు భూములు, పట్టా భూముల హద్దులు స్పష్టతకు వస్తాయని అన్నారు.అభివృద్ధి పనుల్లో ఎక్కడా జాప్యం చేయవద్దని, ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అటవీ శాఖ జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.