25 July, 2026 | 3:11 AM

బోగస్ బంగారం దందాకు.. ‘బీఐఎస్’ బ్రేక్..!

25-07-2026 02:32 AM

హాల్‌మార్క్ లేని ఆభరణాలపై ఉక్కుపాదం 

రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు

జ్యూవెలరీ వ్యాపారుల్లో కలకలం

రంగారెడ్డి, జూలై 24 (విజయక్రాంతి): బంగారం కొనుగోలు అంటే నమ్మకం.. కానీ అదే నమ్మకాన్ని పెట్టుబడిగా చేసుకుని కొం దరు జ్యూవెలరీ వ్యాపారులు ఏళ్ల తరబడి సాగిస్తున్న బోగస్ దందాకు భారతీయ ప్రమాణాల బ్యూరో (బిస్) గట్టి బ్రేక్ వేసింది.

హాల్‌మార్క్ లేకుండా ఆభరణాల విక్రయాలు, నాణ్యత లేని పసిడిని అంటగట్టడం, ‘తరుగు, మరుగు‘ పేరుతో వినియోగదారుల జేబులకు చిల్లులు పెట్టే అక్రమాలపై బీఐఎస్ అధికారులు యుద్ధం ప్రకటించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంతో పాటు తెలంగాణలోని పలు కీలక జిల్లాల్లో బీఐఎస్ బృందాలు నిర్వహించిన మెరుపు దాడులు జ్యూవెలరీ వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

నిబంధనలు బేఖాతరు.. కోట్లలో అక్రమ వ్యాపారం..

కేంద్ర ప్రభుత్వం హాల్మార్కింగ్ను తప్పనిసరి చేసినప్పటికీ, కొందరు వ్యాపారులు ఇప్పటికీ నిబంధనలను పక్కనబెట్టి హాల్‌మార్క్ లేని ఆభరణాలను విక్రయిస్తున్నట్లు బీఐఎస్ దాడుల్లో ఆధారాలతో సహా బయటపడింది.

వినియోగదారులు తాము స్వచ్ఛమైన 22 క్యారెట్ల (22కే916) బంగారం కొంటున్నామని భావిస్తే, వాస్తవానికి నాణ్యతపై ఎలాంటి హామీ లేని, తక్కువ క్యారెట్ల ఆభరణాలు వారి చేతికి చేరుతుండటంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల్లో భాగంగా ఇటువంటి దుకాణాల నుంచి అధికారులు భారీ మొత్తంలో హాల్మార్క్ లేని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

జీవితకాల పొదుపుతో ఘరానా మోసం..

బంగారం కొనుగోలు అనేది సామాన్య, మధ్యతరగతి కుటుంబాల జీవితకాల పొ దుపు, సెంటిమెంట్తో ముడిపడి ఉంది. అ లాంటి సందర్భంలో నాణ్యతలో రాజీ ప డటం, పారదర్శకత లేకుండా వ్యా పారం చేయడం వినియోగదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యం గా హాల్మార్క్ లేని ఆభరణాల ను భవిష్యత్తులో తిరిగి అమ్మాలన్నా లేదా కుదువ పెట్టాలన్నా వినియోగదారులు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

జేబులకు చిల్లులు..

‘తరుగు.. మరుగు’ పేరుతో లెక్కల్లో చూ పే వ్యత్యాసాలతో వినియోగదారులు భారీ గా నష్టపోతున్నారు. హాల్‌మార్కింగ్, పక్కా రసీదులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.

ఆరు అంకెల హుయిడ్ తప్పనిసరి..

బీఐఎస్ హైదరాబాద్ శాఖ డైరెక్టర్ పీ.వి. శ్రీకాంత్ ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్లు, ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలు చేపట్టాయి. ప్రతి బంగారు ఆభరణంపై బిస్ లోగోతో పా టు తప్పనిసరిగా 6 అంకెల హుయిడ్ (హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్) సంఖ్య ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. హాల్‌మార్క్ దుర్వినియోగం చేసినా, నకిలీ ముద్రలు వేసినా, హుయిడ్ లేని ఆభరణాలను విక్రయించినా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండరడ్స్ యాక్ట్-2016’ కింద భారీ జరిమానాలు, జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు.

కొనుగోలుదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

కొనుగోలు చేసే ఆభరణంపై బిస్ లోగో, బంగారు స్వచ్ఛత (ఉదా: 22కే916) మరి యు 6 అంకెల హుయిడ్ కోడ్ ఉందో లేదో సరిచూసుకోవాలి.వ్యాపారి నుండి ఖచ్చితంగా ప్రింటెడ్ బిల్లు తీసుకోవాలి. ఆ రసీ దుపై మీ ఆభరణానికి సంబంధించిన హుయిడ్ నంబర్ నమోదు చేశారో లేదో గమనించాలి.

మోసపోతే ఫిర్యాదు చేయండి ఇలా..

హాల్‌మార్క్ లేని లేదా అనుమానాస్పద బంగారు ఆభరణాల విక్రయాలు మీ దృష్టికి వస్తే వెంటనే ’బిస్ కెర్ ’మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని బీఐఎస్ తెలిపింది.ఈ యాప్లోని ’వెరీఫై హుయిడ్’ ఫీచర్ ద్వారా మీరు కొనుగోలు చేసే ఆభరణం యొక్క నిజమైన స్వచ్ఛతను, వ్యాపారి వివరాలను స్వయంగా సరిచూసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం బీఐఎస్ అధికారిక వ్బుసైట్ను సందర్శించవచ్చని అధికారులు వెల్లడించారు.