25 July, 2026 | 3:13 AM

ప్రెస్‌క్లబ్ సభ్యులకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షా శిబిరం

25-07-2026 02:43 AM

పంజాగుట్ట, జూలై 24 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల శిబిరం అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు నిమ్స్ లో శిబిరాన్ని శుక్రవారం ప్రారంభించారు.

నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ పర్యవేక్షణలో జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు మాస్టర్ హెల్త్ చెకప్ పేరిట ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు విజయకుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వరికుప్పల రమేశ్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ లో పేరు నమోదైన సభ్యులకు మాత్రమే శిబిరంలో ఆరోగ్య పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. చాలా మంది ప్రెస్ క్లబ్ సభ్యులు పని ఒత్తిడి కారణంగా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రభుత్వ సహకారంతో నిమ్స్ లో నిర్వహిస్తున్న ఈ ఆరోగ్య పరీక్షల శిబిరం వారికొక సువర్ణ అవకాశంగా అభివర్ణించారు.అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హెల్త్ కార్డ్ కలిగిన క్లబ్ సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ డీన్ చంద్రశేఖర్, సీనియర్ ప్రొఫెసర్ పరంజ్యోతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చరణ్ రాజు, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు ఏ .రాజేష్, అరుణ అత్తలూరి, జాయింట్ సెక్రటరీ చిలుకూరి హరిప్రసాద్, కోశాధికారి రమేష్ వైట్ల, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఎన్. శ్రీనివాస్ రెడ్డి, వనం నాగరాజు, అశోక్ దయ్యాల, రచన ముడుంబై, నిమ్స్  మీడియా రిలేషన్ ఆఫీసర్ సత్యగౌడ్, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.