విష్ స్కూల్ విధానం అభినందనీయం
ప్రముఖ నటి మంచు లక్ష్మి
బంజారాహిల్స్, జూలై 24 (విజయక్రాంతి): చిన్నారుల సర్వతోముఖాభివృద్ధి కోసం వెల్లింగ్టన్ ఇంటర్నేషనల్ స్కూల్ (విష్) అవలంబిస్తున్న విధానం అభినందనీయమని ప్రముఖ నటి మంచు లక్ష్మి అన్నారు. బంజారాహిల్స్ లోని సాగర్ సొసైటీలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కూల్ ను శుక్రవారం ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ ప్రతి చిన్నారి సహజ ప్రతిభను వికసింపజేసుకునే వాతావరణంలో ఎదగాలని ఆకాంక్షించారు. పిల్లల్లో జిజ్ఞాస, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, కరుణ వంటి విలువలను సహజంగా పెంపొందించేలా విష్ విద్యా విధానాన్ని రూపొందించడాన్ని అభినందించారు. ప్రతి చిన్నారి ప్రత్యేకతను గుర్తించి అర్థవంతమైన అభ్యాస అనుభవాలను అందించాలనే లక్ష్యాన్ని ప్రశంసించారు. స్కూల్ వ్యవస్థాపకురాలు దీప్తి చిట్కారా మాట్లాడుతూ ప్రతి చిన్నారి అపారమైన సామర్థ్యంతో జన్మిస్తాడనే నమ్మకంతో విష్ విద్యా విధానాన్ని రూపొందించామన్నారు.
స్కాండినేవియన్ అభ్యాస వాతావరణం, జపాన్ విద్యా విధానంలోని స్వతంత్రత, మైండ్ఫుల్నెస్, పరస్పర గౌరవం వంటి విలువలు, ప్రపంచ ప్రసిద్ధ రెగ్గోగో ఎమీలియా విధానం, ఎర్లీ ఇయర్ ప్రోగ్రామ్ సూత్రాలను సమన్వయం చేస్తూ ప్రత్యేకమైన అభ్యాస విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. భద్రతతో కూడిన ప్రేరణనిచ్చే, ఆనందభరితమైన వాతావరణంలో పిల్లలు తమ సామర్థ్యాన్ని గుర్తించి అభివృద్ధి చెందేలా చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, అనుభూతి, జీవితాంతం నేర్చుకునే ఆసక్తిని పెంపొందించడమే తమ ధ్యేయమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సహ వ్యవస్థాపకుడు మనవ్ పురి, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






