యూకేకు బీటలు!
ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన బ్రిటన్(Britain) నేడు ఉనికిని కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. స్కాట్లాండ్(Scotland), వేల్స్(Wales), నార్త్ ఐర్లాండ్(Northern Ireland)లలో స్వపరిపాలన కాంక్ష పెరుగుతుండటం, తత్ఫలితంగా యునైటెడ్ కింగ్‌డమ్(United Kingdom) నుంచి విడిపోవాలన్న డిమాండ్ ఊపందుకుకోవడం బ్రిటన్‌కు అశనిపాతంగా మారింది. ఇటీవల కార్డిఫ్‌లో సమావేశమైన వేల్స్, స్కాట్లాండ్, నార్త్ ఐర్లాండ్‌కు చెందిన ఫస్ట్ మినిస్లర్లు యూకే భావన ముగింపు దశకు చేరుకున్నదని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
ఇప్పటికే రాజకీయ సంక్షోభం(Political crisis)తో సతమతమవుతున్న యూకేకు ఇది మరో తలనొప్పిని తెచ్చిపెట్టిందనే చెప్పాలి. కాగా, ప్రస్తుత యూకే అనే భావనకు 1707లో బీజం పడింది. నాడు ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ కలిసి గ్రేట్ బ్రిటన్‌గా ఏర్పడ్డాయి. 1801లో ఐర్లాండ్ కలయికతో యూకే మరింత పటిష్ఠంగా మారింది. 1922లో ఐర్లాండ్ రెండు ముక్కలైనప్పటికీ, నార్త్ ఐర్లాండ్ మాత్రం బ్రిటన్‌తో కొనసాగేందుకు మొగ్గుచూపింది. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఐక్యత ప్రపంచ యవనికపై బ్రిటన్ తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు దోహదపడింది.
ఒకే ఆర్థిక వ్యవస్థ, ఉమ్మడి విదేశాంగ విధానం, విస్తృత మార్కెట్, బలమైన రక్షణ వ్యవస్థ వంటి అంశాలు ఇప్పటికీ బ్రిటన్‌ను ప్రపంచ ప్రభావశీల దేశాల్లో ఒకటిగా నిలుపుతున్నాయి. అయితే ఐక్యంగా ఉన్నంత మాత్రాన అసంతృప్తి లేదని చెప్పడం పొరపాటే అవుతుంది. స్కాట్లాండ్‌లో ప్రత్యేక జాతీయ గుర్తింపు, వేల్స్‌లో స్వయంపాలన, తిరిగి ఐర్లాండ్‌లో విలీనం కావాలన్న ఆకాంక్షలు ఉత్తర ఐర్లాండ్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. 2016లో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకురావడం ఈ అసంతృప్తిని మరింత పెంచింది.
బ్రిటన్ నుంచి వేరు కుంపటి పెట్టుకోవడం వల్ల వేల్స్, స్కాట్లాండ్, నార్త్ ఐర్లాండ్‌లకు స్వయం నిర్ణయాధికారం లభించవచ్చు కానీ, అదే సమయంలో ఆర్థిక స్థిరత్వం, రక్షణ సామర్థ్యం, అంతర్జాతీయ ప్రభావం తగ్గే ప్రమాదమూ లేకపోలేదు. అప్పులు, ఆస్తులు, పన్నులు, వాణిజ్యం, సరిహద్దులు వంటి సమస్యలకు సమాధానాలు కూడా వెతకాల్సి ఉంటుంది.
కాగా, ప్రజాభిప్రాయ సేకరణకు నార్త్ ఐర్లాండ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ, స్కాట్లాండ్, వేల్స్ మాత్రం బ్రిటన్ ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. అందువల్ల యూకే ఐక్యతకు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమీ లేదని చెప్పక తప్పదు. అయినప్పటికీ విడిపోవాలనే ఆకాంక్షను మాత్రం ఎక్కువ కాలం తొక్కిపెట్టలేమనే వాస్తవాన్ని విస్మరించకూడదు.