15 July, 2026 | 1:37 AM

క్రెడిట్ కార్డులు మస్తు వాడేస్తున్నారు

26-04-2024 12:20 AM

 ఈ ఏడాది మార్చిలో ఆన్‌లైన్ ద్వారా జరిగిన క్రెడిట్ కార్డు వ్యయాలు రూ.1,04,081 కోట్లకు చేరాయి. ఒకే నెలలో రూ.లక్ష కోట్ల మార్క్‌ను దాటడం ఇదే ప్రధమం. పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ ద్వారా జరిగిన ఆఫ్‌లైన్ క్రెడిట్ కార్డుల లావాదేవీల విలువ ఈ మార్చిలో రూ.60,378 కోట్లకు పెరిగాయి. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ కలిపి మొత్తం క్రెడిట్ కార్డు లావాదేవీల విలువ  2024 మార్చిలో 20 శాతం వృద్ధితో రూ.1,37,310 కోట్ల నుంచి రూ.1,64,586 కోట్లకు చేరాయి. 

తొలిసారి ఒకే నెలలో రూ.1 లక్ష కోట్ల ఆన్‌లైన్ లావాదేవీలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: వినియోగదారులు క్రెడిట్ కార్డుల్ని ఎడాపెడా వాడేస్తున్నారు. దీంతో ఈ ఏడాది మార్చిలో ఆన్‌లైన్ ద్వారా జరిగిన క్రెడిట్ కార్డు వ్యయాలు రూ.1,04,081 కోట్లకు చేరాయి. ఒకే నెలలో రూ.లక్ష కోట్ల మార్క్‌ను దాటడం ఇదే ప్రధమం. 2023 మార్చిలో జరిగిన ఆన్‌లైన్ క్రెడిట్ కార్డు లావాదేవీల విలువ రూ.86,390 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో 20 శాతం పెరిగాయి. 2024 ఫిబ్రవరిలో ఇవి రూ.94,774 కోట్లు. పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ ద్వారా జరిగిన ఆఫ్‌లైన్ క్రెడిట్ కార్డుల లావాదేవీల విలువ ఈ మార్చిలో రూ.60,378 కోట్లకు పెరిగాయి. గత ఏడాది మార్చిలో జరిగిన రూ.50,920 కోట్లకంటే తాజాగా ముగిసిన నెలలో ఈ విలువ 19 శాతం వృద్ధిచెందింది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ కలిపి మొత్తం క్రెడిట్ కార్డు లావాదేవీల విలువ  2024 మార్చిలో 20 శాతం వృద్ధితో రూ. 1,37,310 కోట్ల నుంచి రూ.1,64,586 కోట్లకు చేరాయి. 

తగ్గిన డెబిట్ కార్డు లావాదేవీలు..

క్రెడిట్ కార్డు లావాదేవీలు క్రమంగా పెరు గుతుండగా, మరోవైపు డెబిట్ కార్డు లావాదేవీలు భారీ గా తగ్గుతున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో డెబిట్ కార్డు లావాదేవీల సంఖ్య స్టోర్స్‌లో 30 శాతం తగ్గి 11.6 కోట్లకు పడిపోయాయి. ఆన్‌లైన్‌లో వీటి సంఖ్య 41 శాతం తగ్గి 4.3 కోట్లకు చేరింది. విలువరీత్యా డెబిట్ కార్డు లావాదేవీలు స్టోర్స్‌లో మార్చిలో 17 శాతం క్షీణించి రూ.29,309 కోట్లకు, ఆన్‌లైన్‌లో 16 శాతం తగ్గుదలతో రూ.15,213 కోట్ల వద్ద నిలిచాయి.  

10 కోట్ల కార్డులు..

దేశంలో క్రెడిట్ కార్డుల సంఖ్య ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా 10 కోట్ల మార్క్‌ను దాటగా, మార్చి చివరినాటికి ఇవి 10.2 కోట్లకు పెరిగాయి. క్రెడిట్ కార్డుల మార్కెట్లో అత్యధికంగా 20.2 శాతం వాటా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ది కాగా, తదుపరి స్థానాన్ని 18.5 శాతం వాటాతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆక్రమిస్తున్నది. ఐసీఐసీఐ బ్యాంక్‌కు 14 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు 5.8 శాతం చొప్పున వాటా ఉన్నది. క్రెడిట్ కార్డుల జారీచేసే టాప్ 10 బ్యాంక్‌లకు కలిపి 90 శాతం మార్కెట్ వాటా ఉన్నది.

చిన్న కొనుగోళ్లకూ క్రెడిట్ కార్డులే..

పరిమాణం రీత్యా చూస్తే క్రెడిట్ కార్డు వినియోగం భారీగా పెరిగినట్టు వెల్లడవుతున్నది. పాయింట్ ఆఫ్ సేల్ లావాదేవీల సంఖ్య 2024 మార్చి నెలలో 28 శాతం వృద్ధిచెంది 18  కోట్లకు చేరగా, ఆన్‌లైన్ చెల్లింపుల సంఖ్య  గణనీయంగా 33 శాతం పెరిగి 16.4 కోట్లకు ఎగిసింది. లావాదేవీల విలువకంటే సంఖ్య భారీగా పెరగడం..చిన్న చిన్న కొనుగోళ్లకు సైతం ఖాతాదారులు క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరుపుతున్నారని ఈ ట్రెండ్ సూచిస్తున్నది. ప్రస్తుతం యూపీఐ నెట్‌వర్క్ ద్వారా కూడా క్రెడిట్ కార్డు లావాదేవీలు అనుమతిస్తున్నందున, సగటు లావాదేవీ విలువ మరింత తగ్గే అవకాశం ఉన్నదని బ్యాంకర్లు చెపుతున్నారు.