కమిన్స్‌కు రూ.113 కోట్ల డీల్
క్రికెట్ ఆస్ట్రేలియా బంపర్ ఆఫర్
టీ20 లీగ్స్ వైపు వెళ్లకుండా ప్లాన్
మెల్‌బోర్న్, మే 7: ప్రపంచ వ్యాప్తంగా టీ20 ఫార్మాట్‌కు క్రేజ్ పెరిగిన తర్వాత విపరీతంగా పుట్టుకొచ్చిన లీగ్స్‌తో కొన్ని దేశాల క్రికెట్ బోర్డులకు భయం పట్టుకుంది. లీగ్స్‌లో భారీగా ఆఫర్ చేస్తున్న డబ్బులతో కీలక ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి వెళ్లిపోతున్నారు. ఈ కారణంగానే వెస్టిండీస్ జట్టు ఎలా పతనమైందో అందరూ చూసారు. ఇలాంటి పరిస్థితి తమకు రాకుండా క్రికెట్ ఆస్ట్రేలియా ముందు జాగ్రత్త పడుతోంది.
తమ స్టార్ ప్లేయర్స్‌కు భారీగా కాంట్రాక్టులు ఆఫర్ చేస్తోంది. తాజాగా ఐపీఎల్‌తో బిజీగా ఉన్న సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు ఆసీస్ బోర్డు భారీ ఆఫర్ ఇచ్చింది. ఏకంగా రూ.113 కోట్లు ఆఫర్ చేసిందని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది. రానున్న మూడేళ్లలో వన్డే వరల్డ్‌కప్, టీ20 ప్రపంచకప్, టెస్టు ఛాంపియన్‌షిప్ లాంటి టోర్నీలు జరగాల్సి ఉన్నాయి. ఇదే సమయంలో కొన్నేళ్లుగా కమిన్స్ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా, ప్లేయర్ గా ఆకట్టుకుంటున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌తో పాటు, ఫ్రాంచైజీ లీగుల్లోనూ రాణిస్తున్నాడు.
దీంతో అతడిని ఇంకొంతకాలం ఆస్ట్రేలియా జాతీయ జట్టులో కొనసాగించాలని ఆసీస్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఈ క్రమంలోనే అతడికి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మూడేళ్ల కాలానికి 12 మిలియన్ డాలర్ల భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఏడాదికి 4 మిలియన్ డాలర్లు. ఈ బిగ్ డీల్‌తో కమిన్స్‌తో మూడేళ్లకు అగ్రిమెంట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుందని సమాచారం. ఈ సమయంలో వన్డే, టీ20, టెస్టు మూడు ఫార్మాట్లలో ఆసీస్ జట్టు తరఫున తొలి ప్రాధాన్యంగా ఆడేలా ఒప్పందం చేసుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది.
ఒకవేళ ఇది నిజమైతే క్రికెట్ వర్గాల్లో ఇదే భారీ డీల్ అవుతుంది. కమిన్స్‌తో పాటు, మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్‌తో కూడా ఇలాంటి అగ్రిమెంట్ చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. గతంలో ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ అంతర్జాతీయంగా గ్లోబల్ టీ20 లీగుల్లో తమ తరఫున ఆడేలా కమిన్స్‌కు దాదాపు రూ.62 కోట్లు ఆఫర్ ఇచ్చిందని.. ఈ నేపథ్యంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా డీల్ చేసుకొనేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది.






