15 August, 2026 | 10:26 AM

80th Independence Day: ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోడీ

15-08-2026 09:52 AM

ఆత్మనిర్భర్ భారత్ సాధనే మన లక్ష్యం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీ ఎర్రకోటలో 80వ స్వాతంత్య్ర(80th Independence Day) వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రధాని మోదీ(PM Narendra Modi) ఎర్రకోటపై వరసగా 13వ సారి జాతీయ జెండా ఎగురవేయడం విశేషం. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోందని, ప్రతి ఇంటిపై జాతీయ జెండా(National Flag) ఎగురుతోందని చెప్పారు. ఎందరో వీరుల బలిదానాల ఫలితమే స్వాతంత్య్రం అన్నారు. తొలిసారి ఎర్రకోట వద్ద వందేమాతరం ఆలపించామని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సాధన లక్ష్యం కోసం జీవితమంతా త్యాగం చేశారని కొనియాడారు.  దేశం కొత్త సంకల్పంతో ముందుకు వెళ్తోందన్న ప్రధాని మోదీ మన సంకల్పం, కలలు సాకారమవుతున్నాయని సూచించారు. 2047 నాటికి వికసిత్ భారత్(Viksit Bharat 2047) లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.

ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది: ప్రధాని మోదీ

భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా ఎదుగుతోందని ప్రధాని వెల్లడించారు. సంకల్పం దృఢంగా ఉంటే కఠిన సవాళ్లను సునాయసంగా ఎదుర్కోవచ్చని తెలిపారు. ఇవాళ ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని చెప్పారు. శౌచ లయాలు 4 రెట్ల వేగంతో నిర్మించామన్నారు. పేదలకు ఇళ్లు 3 రెట్ల వేగవంతంతో నిర్మించామని సూచించారు. దేశవ్యాప్తంగా మెట్రో రైళ్ల సదుపాయాలు పెంచామన్నారు. ఆత్మనిర్భర్ భారత్ సాధనే మన లక్ష్యమని పేర్కొన్నారు. భారత్ లో సెమీకండక్టర్ల తయారీ కూడా సాకారమవుతోందన్నారు. దేశంలో 70 నగరాల్లోని 1.75 కోట్ల ఇళ్లకు పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందిస్తున్నామని తెలిపారు. ఇంధన భద్రత సాధించటం దేశ తక్షణ అవసరం అన్నారు. వెయ్యి గిగావాట్ల అణు ఇంధనం సాధించటం మన లక్ష్యమని పేర్కొన్నారు. ఇటీవలే హైడ్రోజన్ రైలును విజయవంతంగా నడిపించామని హర్షం వ్యక్తం చేశారు. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధాని పేర్కొన్నారు. అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు సాగాలని ప్రధాని పిలుపునిచ్చారు. వికసిత్‌ భారత్‌లో యువకుల పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. మన దగ్గర అన్ని రకాల వనరులు ఉన్నాయన్న నరేంద్ర మోదీ భారత్‌ డిజిటల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌గా మారుతోందని పేర్కొన్నారు. ఇకపై ఆగేదే లేదు.. తగ్గేదే లేదని వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా మరింత వేగంగా పరుగులు పెట్టాలని ప్రధాని మోడీ సూచించారు.